మూడు పువ్వులు ఆరు కాయలుగా నకిలీ మందుల వ్యాపారం

by Bhanu |

గ్రేటర్ హైదరాబాద్ లోని మెడికల్ షాప్ లలో నకిలీ మందులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వారికి నకిలీ మందులు అంటగట్టి నిలుపుదోపికి పాల్పడడమే కాకుండా వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి.

మూడు పువ్వులు ఆరు కాయలుగా నకిలీ మందుల వ్యాపారం
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లోని మెడికల్ షాప్ లలో నకిలీ మందులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వారికి నకిలీ మందులు అంటగట్టి నిలుపుదోపికి పాల్పడడమే కాకుండా వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఏ చిన్న రోగం వచ్చినా ఆస్పత్రులకు వెళ్తే ఓ వైపు వైద్యులు వారికి అవసరం లేని టెస్టులు రాసి జేబులు గుల్ల చేస్తుండగా మరోవైపు మెడికల్ షాప్ ల నిర్వాహకులు డాక్టర్ రాసిన మందులు ఇవ్వకుండా నకిలీ మందులు ఇస్తున్నారు.

దీంతో ఎన్ని రోజులైనా జబ్బు తగ్గకపోవడం, తమకు ఎలాంటి అనారోగ్యానికి గురయ్యామో తెలియకుండా రోగులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. రెగ్యులర్ గా డ్రగ్ ఇన్ స్పెక్టర్లు మెడికల్ షాపులను తనిఖీ చేసి మందుల నాణ్యత, గడువు ముగిసి మందులను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే వారు పూర్తి స్థాయిలో వీటిపై దృష్టి సారించకపోవడంతో మెడికల్ షాప్ నిర్వహాకుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. డ్రగ్ కంట్రలో అధికారులు ప్రైవేట్, కార్పొరేట్, ఇతర ఫార్మా కంపెనీలతో లాలూచి పడి వారు దాడులు మరిచారనే టాక్ వినబడుతోంది .

డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే విక్రయాలు..

గ్రేటర్ హైదరాబాద్ లోని దాదాపు అన్ని మెడికల్ షాపులలో ఎలాంటి డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకున్నా సొంతంగా మందులు రోగులకు అంటగడుతున్నారు . వాస్తవానికి ప్రతి మెడికల్ షాప్ లో ఫార్మసిస్టులు తప్పనిసరి ఉండాలి. అయితే చాలా వరకు వారు లేకుండానే ఫార్మసీ సర్టిఫికెట్లు అద్దెకు తెచ్చుకుని బినామీలుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు . కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలు నిత్యం మందులు కొనుగోలు చేస్తుంటారు. దీంతో ప్రతి చోట కిరాణా దుకాణాల మాధిరి మందుల దుకాణాలు తెరుస్తున్నారు. అంతేకాకుండా డాక్టర్ల చిట్టీలతో సంబంధం లేకుండా మందులను విక్రయిస్తుండగా వీటిల్లో చాలా వరకు నకిలీ మందులు ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు విస్మరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురౌతోందని పలువురు వాపోతున్నారు . కాలపరిమితి దాటిన మందులు , నకిలీ డ్రగ్స్ విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. డాక్టర్‌ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే వాటికి బదులు వేరే కంపెనీ మందులను సేమ్ ఫార్మూలా అంటూ అంటగడుతున్నారు. ఇది కూడా దానిలాగే పనిచేస్తుందని చెబుతున్నారు. అనేక షాపుల్లో కాలం చెల్లిన మందులు యథేచ్చగా అమ్ముతున్నారు. కొన్ని చోట్ల అర్హత, అనుభవం లేని వ్యక్తులు ఫార్మసిస్ట్‌ సర్టిఫికెట్లతో మెడికల్‌ షాపులను ఏర్పాటు చేస్తున్నారు.

దాడులలో విస్తుపోయే నిజాలు..

కోఠిలోని ఇందర్ బాగ్ కు హోల్ సేట్ మందుల మార్కెట్ గా గుర్తింపు ఉంది. ఇక్కడ వందల సంఖ్యలో హోట్ సేల్ దుకాణాలు ఉండగా ఇక్కడికి జంటనగరాల మెడికల్ షాప్ ల నిర్వాహకులతో పాటు జిల్లాల నుండి కూడా కొనుగోలు కోసం వస్తుంటారు. ప్రతినిత్యం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయే మార్కెట్ లో కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతుంటాయి. ఇంతటి పేరున్న మార్కెట్ పై ఔషద నియంత్రణ సంస్థ అధికారులు దాడులు మరచిపోవడంతో నిర్వాహకులు నకిలీ మందుల విక్రయాలకు తెరలేపారు . ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అధికారులు మార్కెట్ లోని కొన్ని హోల్ సేల్ దుకాణాలపై దాడులు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కేవలం రెండు దుకాణాలలోనే లక్షలాధి రూపాయల నకిలీ మందులు పట్టుబడడంతో అధికారులు సైతం షాక్ తిన్నారు . వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇతర దుకాణాలపై కూడా అధికారులు దాడులు చేస్తే కోట్లాది రూపాయల నకిలీ మందులు పట్టుబడే అవకాశం లేకపోలేదు.

జిల్లాలకు సరఫరా..?

ఇందర్ బాగ్ హోల్ సేల్ మార్కెట్ నుండి జంటనగరాలతో పాటు తెలంగాణ , ఏపీలోని జిల్లాలకు మందుల సరఫరా జరుగుతుంటుంది . అధికారుల దాడులు జరిపిన సమయంలో పెద్ద మొత్తంలో నకిలీ మందులు పట్టుబడడంతో ఇవి జిల్లాలకు కూడా సరఫరా జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . మార్కెట్ లో వందలాది హోల్ సేల్ దుకాణాలు ఉండగా అన్ని షాప్ లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసి నకిలీ మందులు అరికట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇందర్ బాగ్ మార్కెట్ నుండి నగరంతో పాటు జిల్లాల లోని ఏ షాప్ కు ఎంత నకిలీ మెడిసిన్ వెళ్లిందో గుర్తించి వాటిపై కూడా దాడి చేసి సీజ్ చేయాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఔషద నియంత్రణ సంస్థ అధికారులను కోరుతున్నారు .

Next Story