- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ సమ్మిట్‌తో రియల్ రైజింగ్.. ఫ్యూచర్ సిటీకి విశ్వవ్యాప్త గుర్తింపు!
బహుళ జాతి సంస్థలు ఒక చోట.. వీటన్నింటికి దూరంగా పరిశ్రమలు. ఇలా.. పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా నాలుగో మహానగరం సిద్దమవుతోంది.

-దిశ, తెలంగాణ బ్యూరో/ రంగారెడ్డి బ్యూరో : ‘భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలివి. అవును..నిజంగా ఇది భవిష్యత్ నగరమే అని వివిధ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. మారుతున్న పరిస్థితులు..పెరిగిన జనాభా.. అందివస్తున్న సాంకేతికత.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి ఆర్థిక సదస్సు తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త గుర్తింపు వచ్చింది. పెట్టుబడులకు భద్రత చేకూరి పరిశ్రమల స్థాపనకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న రోజుల్లో ఎంతో మందికి ఉపాధి లభించనున్నది. పది జోన్లుగా అభివృద్ది చేసేందుకు చేపడుతున్న పటిష్ట ప్రణాళికలపై అన్ని వర్గాలకు సమ్మిట్ తర్వాతే ఓ స్పష్టత వచ్చింది. మొత్తంగా ఫ్యూచర్ సిటీకి గేమ్ ఛేంచర్ గా నిలిచిన సమ్మిట్.. రియల్ ఎస్టేట్ రంగానికి సైతం కొత్త ఊపును తీసుకొచ్చింది.
చుట్టూ పచ్చదనం.. విశాలమైన రహదారులు.. లక్షలాదిమంది నివసించేలా నివాస ప్రాంతాలు.. వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు.. బహుళ జాతి సంస్థలు ఒక చోట.. వీటన్నింటికి దూరంగా పరిశ్రమలు. ఇలా.. పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా నాలుగో మహానగరం సిద్దమవుతోంది. ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పటికే ప్రభుత్వం 13,972 ఎకరాలను సిద్దం చేసి ఉంచగా.. మరో 15 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి మొత్తం 30 వేల ఎకరాల్లో భావి నగరం ప్రణాళికా బద్దంగా రూపుదిద్దుకుంటోంది. పెద్ద ఎత్తున టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు లక్షలాది మంది ఈ ప్రాంతంలో నివసించేలా అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలను అమలుపరుస్తోంది. పది జోన్లుగా విభజించి అన్ని జోన్లలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, ఏకో టూరిజంతోపాటు అన్ని వసతులు నవ నగరంలో ఏర్పాటు కానున్నాయి. జూపార్క్‌లు, సినీ స్టూడియోలు, థియేటర్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కానున్నాయి. మలక్‌పేట్‌లో 150 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్‌ను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీసీసీఐ కూడా ఈ ప్రాంతంలో అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు సంకల్పిస్తోంది.
స్తిరాస్థి పెట్టుబడులకు అనుకూలం..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ మహానగరానికి దక్షిణ దిశలో ఉన్న ఫ్యూచర్ సిటీకి కొత్త ఊపును తీసుకొచ్చింది. భవిష్యత్ నగరంపై ఆశలు చిగురిస్తుండడం.. నలుమూలల నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఉండడం..వంటివి రియల్ రంగానికి దోహదపడుతున్నాయి. ఫోర్త్ సిటీ నుంచి అమరావతి వరకు 211 కి.మీ.ల మేర 12వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటికే నగరానికి వెలుపల ఉన్న బాహ్య, అంతర్గత వలయాలతోపాటు త్వరలోనే కార్యరూపంలోకి రానున్న ప్రాంతీయ వలయ రహదారికి.. అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఉండేలా పెద్ద ఎత్తున రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వద్ద నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్శిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీ కోసం సర్వే పనులు చకచకా సాగుతున్నాయి.
శంషాబాద్ నుంచి చెన్నై వరకు బులెట్ ట్రైన్ కోసం సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంతోపాటు ఓఆర్‌ఆర్ వంటి మెరుగైన రవాణా సదుపాయం ఉన్న ఫోర్త్ సిటీ వైపుగానే కంపెనీల ఏర్పాటుకు చాలా వరకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ లో పెద్ద పెద్ద కంపెనీలు రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడానికి కనెక్టివిటీ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇన్ని అనుకూలత నేపథ్యంలో నెట్ జీరో సిటీలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజకంగా ఉంటుందని వివిధ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. ఇక్కడ భూముల ధరలు సైతం కాస్త తక్కువగానే ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతంలో కొనుగోళ్లకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ చుట్టూ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. కొద్దిరోజుల క్రితం వరకు క్రయ విక్రయాలలో స్తబ్దత కొనసాగగా.. సమ్మిట్ తర్వాత లే అవుట్లలో సైట్ విజిట్‌లు జోరందుకున్నట్టు తెలుస్తోంది.
గ్లోబల్ సమ్మిట్ కాదు.. సంకల్పం : ఎన్. జయదీప్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కేవలం ఒక సమావేశం కాదు.. ఇది ప్రభుత్వ దృఢ సంకల్పానికి స్పష్టమైన ప్రకటన. రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్ రియల్ ఎస్టేట్ రంగానికి దీర్ఘకాలిక ప్రణాళికలకు అవసరమైన స్థిరత్వాన్ని, విశ్వాసాన్ని అందిస్తుంది. CURE, PURE, RAREలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. దీంతో కోర్ అర్బన్ రీజియన్‌కు బయటనున్న ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య స్థలాలు, పారిశ్రామిక పార్కులపై బలమైన డిమాండ్‌ను సృష్టిస్తుంది. ఇటీవల HMDA నిర్వహించిన ప్రైమ్ భూముల వేలంపాటల్లో రికార్డు ధరలు పలకడం పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనం. ఇది హైదరాబాద్ తదుపరి వృద్ధికి బాటలు వేస్తుంది.
గృహాలకు డిమాండ్ : క్రాంతి కిరణ్ రెడ్డి
పెట్టుబడుల పరిమాణం ఐటీ, తయారీ, వినోదం, లాజిస్టిక్స్ వంటి అనేక రంగాల్లో భారీగా ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది. దీని వల్ల అన్ని వర్గాల ప్రజలకు గృహావాసాలపై డిమాండ్ పెరుగుతుంది. తెలంగాణను $3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రభుత్వ దూరదృష్టితో కూడిన ప్రణాళికకు క్రెడాయ్ హైదరాబాద్ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. నాణ్యమైన, సుస్థిరమైన, రెరా-నియంత్రిత ప్రాజెక్టుల అభివృద్ధికి కట్టుబడి ఉంది.






