నగరంలో ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

by Malleboina Mahesh |

నగరంలో తీవ్రమైన ఉక్కపోత, గాలిలో తేమ శాతం పెరగడంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ, వ్యవసాయ రంగాల్లో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగింది.

నగరంలో ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాలు ఆలస్యం కావడంతో జూలైలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. తీవ్రమైన ఉక్కపోత, గాలిలో తేమ శాతం పెరగడంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ, వ్యవసాయ రంగాల్లో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరిగింది. సాధారణంగా వర్షాకాలంలో కరెంట్ వినియోగం తగ్గుతుండగా, ఈ ఏడాది జూలైలో మాత్రం అసాధారణ రీతిలో డిమాండ్ పెరగడం గమనార్హం. ఈ ఏడాది జులై 1 నుంచి 14 వరకు నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగం గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 6,622.87 మిలియన్ యూనిట్ల (ఎంయూ) నుంచి ఈ ఏడాది ఏకంగా 7,159.21 మిలియన్ యూనిట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే 536.34 మిలియన్ యూనిట్ల అదనపు వినియోగంతో 8.1 శాతం వృద్ధి నమోదైంది.

గ్రేటర్ పరిధిలో డిమాండ్ జోరు

టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో జులై మొదటి రెండు వారాల్లో విద్యుత్ వినియోగం గత ఏడాది 2,338.79 మిలియన్ యూనిట్ల నుంచి ఈ ఏడాది 2,510.23 మిలియన్ యూనిట్లకు పెరిగింది (7.3శాతం వృద్ధి). ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,071.94 మిలియన్ యూనిట్ల వినియోగం తో 11.9 శాతం రికార్డు స్థాయి వృద్ధి నమోదైంది. అలాగే టీజీ ట్రాన్స్‌కో పరిధిలోనూ కరెంట్ వినియోగం 3,326.29 మిలియన్ యూనిట్ల నుంచి 3,577.04 మిలియన్ యూనిట్లకు (7.5శాతం వృద్ధి) పెరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అడుగులు వేస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, ఫీడర్ల పర్యవేక్షణ ద్వారా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. ఎక్కడా ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఫీల్డ్ లెవెల్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.

నాణ్యమైన విద్యుత్ సరఫరా..

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తున్నాం. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినప్పటికీ.. ముందస్తు వ్యూహం తో సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వినియోగదారులందరికీ విశ్వసనీయమైన విద్యుత్ అందించేందుకు సంస్థ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది.- జితేశ్ వీ పాటిల్, సీఎండీ, టీజీ ఎస్పీడీసీఎల్


Next Story