డిఎంఈ నరేంద్ర కుమార్‌ ఆరేకు ప్రతిష్టాత్మక అవార్డు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-19 16:55:33  IST  )

డిఎంఈ నరేంద్ర కుమార్‌ ఆరేకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది...

డిఎంఈ నరేంద్ర కుమార్‌ ఆరేకు ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ తెలంగాణ బ్యూరో: పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ విభాగంలో చేసిన విశేష కృషికిగానూ తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్‌‌ను జాతీయ అవార్డు వరించింది.చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించడంలో, ముఖ్యంగా చిన్న పిల్లల శస్త్ర చికిత్సల్లో ఆయన అందించిన సేవలకుగానూ ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఒరేషన్ అవార్డు"కు డా.నరేంద్రకుమార్‌ను ఎంపిక చేశారు.శనివారం ఇండోర్‌లో జరిగిన సమావేశంలో డా. నరేంద్ర కుమార్‌ ఈ అవార్డును అందుకున్నారు.

దేశంలో తొలి డాక్టర్ ఆయనే...

దేశంలో పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ విభాగాన్ని డా నరేంద్ర కుమారే ప్రారంభించారని, ఆయన చేసిన కృషితో ప్రస్తుతం దేశవ్యాప్తంగా థొరాసిక్ సర్జరీలో ఎంతోమంది నిపుణులుగా ఎదిగారని పీడియాట్రిక్ అసోసియేషన్ ఈ సందర్భంగా కొనియాడింది.రెండున్నర దశాబ్దాలుగా అత్యంత తక్కువ కోతల తోనే ఎంతో మంది పిల్లలకు సర్జరీలు చేసి, వారి ప్రాణాలను నరేంద్ర కుమార్ కాపాడగలిగారని ప్రశంసించింది.ఆయన మార్గ నిర్దేశంలో పీడియాట్రిక్ థొరాసిక్ సర్జన్లు దేశవ్యాప్తంగా లక్షల మంది పిల్లల ప్రాణాలను నిలబెడుతున్నారని ప్రశంసించింది.

మంత్రి దామోదర ప్రశంసలు...

ఓరేటర్ అవార్డు అందుకున్న నరేంద్రకుమార్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. నరేంద్ర కుమార్‌ సేవలు తెలంగాణ ప్రజారోగ్య రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు.డాక్టర్లు ఆయనను ఆదర్శంగా తీసుకుని తమ కర్తవ్యాన్ని బాధ్యతయుతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు.

Next Story