మేధో దివ్యాంగుల శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

by Kodari Anjali |

మేధో దివ్యాంగుల శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

మేధో దివ్యాంగుల శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మెరుగైన సేవలందించటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి అన్నారు. టోలిచౌకి అనురాగ్ కాలనీలో అనురాగ్ మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేధో దివ్యాంగుల శిక్షణా కేంద్రం, సీనియర్ సిటిజన్ల గృహాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. కేంద్రంలో సీనియర్ సిటిజన్లు, మేధో దివ్యాంగులతో పాటు అన్ని విభాగాల సిబ్బందితో ఆత్మీయంగా కలియ తిరిగి వారితో సంభాషించారు. దివ్యాంగ విద్యార్ధులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాన్ని, వృద్ధులు తయారు చేసిన వృత్తిపరమైన ఉత్పత్తులను ఆమె పరిశీలించి అభినందించారు. సంస్థలోని సీనియర్ సిటిజన్లు, సిబ్బందితో కలిసిమెలసి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, సీనియర్ సిటిజన్లతో సంభాషించారు.

సంస్థ నిర్వహణ తీరుపై...

సంస్థలో మొత్తం 72 మంది మేధో వికలాంగులు ఉన్నారని, అందులో 20 మంది నివాస వసతి పొందుతున్నారని, అలాగే 30 మంది సీనియర్ సిటిజన్లు అక్కడ నివసిస్తున్నారని సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. మేధో దివ్యాంగుల కోసం దియా తయారీ, బుక్ బైండింగ్, ఫినాయిల్ తయారీ, కంప్యూటర్, టైలరింగ్ వంటి వృత్తిపరమైన శిక్షణలను ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు యోగా, సంగీత తరగతులు, ప్రత్యేక పాఠశాల వృద్ధాశ్రమం కోసం తగిన సిబ్బంది ఉన్నారని చెప్పారు. అనంతరం కలెక్టర్ వంటగది, భోజనశాల, యోగా హాల్, సంగీత శిక్షణ గది వంటి అన్ని సౌకర్యాలను పరిశీలించి, సంస్థ నిర్వహణ తీరుపై సంతోషం వ్యక్తం చేసి నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగ పిల్లల ఆరోగ్య పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, సమయానికి ఆహారం అందించాలని ఆదేశించారు. మానవసేవే మాధవసేవా అనే దృక్పథం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాజేందర్, తహసీల్దార్ అనితా రెడ్డి, సంస్థ అధ్యక్షులు ఠాగూర్, కార్యదర్శి టి మాధవుడు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story