అహంకారమే ఓడించింది

by Disha Web Desk 16 |
అహంకారమే ఓడించింది
X
  • కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజాగ్రహం
  • కేటీఆర్, కవిత ప్రవర్తనా తీరు కూడా
  • కొంప ముంచిన కమిషన్లు, అవినీతి
  • బీఆర్ఎస్ నేతల ఓవరాక్షన్‌ ఫలితం
  • చేటు తెచ్చిన యథా రాజా.. విధానం

దిశ, తెలంగాణ బ్యూరో : తిలా పాపం తలా పిడికెడు చందంగా బీఆర్ఎస్ ఓటమికి వంద కారణాలున్నాయి. కేసీఆర్ అహంకార ధోరణితో పాటు ఆయనను ఆదర్శంగా తీసుకున్న కేటీఆర్, కవిత, మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ ప్రవర్తించిన తీరు కూడా కారణమే. ప్రజలకు యాక్సెస్ లేకపోవడం, గ్రీవెన్స్ కోసం మెకానిజం లేకపోవడం, పథకాల్లో కమిషన్లు తీసుకోవడం, ప్రతీ పనిలో అవినీతి ఓపెన్‌గా కనిపించడం.. ఇవన్నీ బీఆర్ఎస్ ఓటమికి కారణాలన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. మామూలు సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేయలేని నిస్సహాయ జనం ఎన్నికల ప్రచారం సందర్భంగా గో బ్యాక్.. మా ఊరికి రావొద్దు.. అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ప్రచార రథంపై వచ్చినవారిని వెనక్కి తరిమారు. ఇంతకాలం ఎక్కడికి పోయావంటూ ముఖం మీదనే నిలదీశారు. దీర్ఘకాలంగా పేరుకుపోయిన వ్యతిరేకత ఒక్కసారిగా భగ్గుమన్నది.

ముఖ్యమంత్రిని కలవాలంటే కొన్ని పద్ధతులుంటాయి.. అసలు ఆయన్ను కలవాల్సిన అవసరం ఏముంటుంది.. సమస్యలు ఉంటేగదా ఆయన్ను కలిసేది.. కలుస్తున్నారంటేనే వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్లు లెక్క.. కేటీఆర్ పబ్లిక్‌గా చెప్తున్న ఇలాంటి మాటలన్నీ ప్రజల్లో అప్పటికే పేరుకుపోయిన ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. కేసీఆర్ ఎలా వ్యవహరించారో ఆయనను చూసి నేర్చుకున్న ఎమ్మెల్యేలు కూడా అదే పద్ధతిని అలవర్చుకున్నారు. మంత్రులకే అనుమతి ఇవ్వకపోవడం, ప్రగతి భవన్‌లోకి పర్మిషన్ లేకుండా ఎంట్రీ లేకపోవడం.. ప్రజలు ఐదేండ్లుగా దీన్ని గమనించి సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారని మేధావులు, ప్రజా సంఘాల నేతలు ఇప్పటికే కామెంట్ చేశారు.

ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైంది :

ఉద్యమ పార్టీ కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ అని స్వయంగా కేసీఆర్ చెప్పుకోవడం మొదలు ఉద్యమద్రోహుల్ని క్యాబినెట్‌లో చేర్చుకోవడం వరకు ప్రజలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలనే కాక సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతును నొక్కేసే నియంత, నిర్బంధ పాలన సాగుతున్నదని విద్యార్థులు, యూత్‌, నిరుద్యోగుల్లో అభిప్రాయం ఏర్పడింది. ధర్నా చౌక్‌ను ఎత్తేయడం, ప్రగతి భవన్ ముందు రోడ్డు మీద ధర్నాలు చేస్తే అరెస్టులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, ఇసుక లారీల కింద తొక్కించడం.. ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఓట్ల రూపంలో రిప్లెక్టు కావడానికి దోహదపడింది.

నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ వైఫల్యం :

నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, యువత ఆకాంక్షలు పదేండ్లలో నెరవేరకపోవడమూ ఒక కారణం. నీళ్ళ విషయంలో లక్ష కోట్ల అప్పుతో కట్టిన కాళేశ్వరం ఐదేండ్లకే పనికిరాకుండా పోవడం, ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినా దానికి తగిన కార్యాచరణ లేకుండా పెండింగ్‌లో పడడం, ప్రశ్నా పత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, ఇంటర్ బోర్డు వైఫల్యంతో విద్యార్థుల సూసైడ్, ప్రవళిక ఆత్మహత్య, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లేకపోవడం, నిరుద్యోగ భృతి హామీ అమలు కాకపోవడం.. ఇలాంటి వందలాది కారణాలు బీఆర్ఎస్‌ను ఇక ఇంటికి పంపాలనే నిర్ణయం తీసుకోడానికి కారణమయ్యాయి. మాటలే తప్ప చేతల్లేవని జనం ఓపెన్‌గానే చర్చించుకున్నారు.

కుటుంబంలో పదవులపై అసంతృప్తి

కేసీఆర్ తన కొడుకు, కూతురు, సడ్డకుడి కొడుకు, మేనల్లుడు.. ఇలా అందరికీ పదవులను ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆత్మగౌరవాన్ని కోరుకునే ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారాన్ని, బీఆర్ఎస్ నేతల అధికార దుర్వినియోగాన్ని సహించలేకపోయారని, గద్దె దించడం మినహా మరో మార్గం లేదని ప్రజా సంఘాలు వ్యాఖ్యానించాయి. ఈసారి బీఆర్ఎస్‌ను ఓడించాలంటూ ఓపెన్‌గానే అప్పీల్ చేయడంతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులను గ్రామాల్లో యాత్రలు క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో చైతన్యానికి ప్లానింగ్ చేశాయి. అది వర్కవుట్ అయిందని తాజా ఫలితాలు రుజువు చేశాయి. రాష్ట్రంలో ప్రతీ పనిలో అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు చివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సైతం దందాలకు పాల్పడ్డారనే కామెంట్లు ప్రజల్లోకి వెళ్ళడం విశేషం.

హామీలిచ్చినా అమలు అంతంతే..

దళితబంధు స్కీమ్‌ పేరును గొప్ప కోసం వాడుకోవడమే తప్ప హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా నిధులు విడుదల చేసి ఆ తర్వాత మర్చిపోయారని, అన్ని హామీలూ అలాగే ఉన్నయనే జనరల్ టాక్ జనంలో మొదలైంది. గృహలక్ష్మి, చేతివృత్తులకు చేయూత (బీసీ బంధు), ముస్లిం బంధు, రైతు రుణమాఫీ.. ఇలాంటివన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయని జనం గ్రహించారు. రైతుబంధు పేరుతో సాయం చేసినా అది సంపన్నులకు మేలు చేయడం కోసం పెట్టిందేనని, పేదలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుండేదని లబ్ధిదారులే వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చినా దాన్ని అటకెక్కించడాన్ని జనం గుర్తుచేశారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి హామీ ఇచ్చినా అసెంబ్లీ వేదికగా మాట మార్చడం కూడా జనానికి ఆగ్రహం కలిగించింది.

Next Story

Most Viewed