కల్తీ నెయ్యిపై ఉక్కుపాదం... 850 కిలోల సీజ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఉక్కుపాదం మోపింది. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర పదార్థాలు, కొవ్వులు కలుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ...

కల్తీ నెయ్యిపై ఉక్కుపాదం... 850 కిలోల సీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఉక్కుపాదం మోపింది. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర పదార్థాలు, కొవ్వులు కలుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. పోలీసుల సమన్వయంతో జూలై 14, 15 తేదీల్లో ఈ విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డా. సంగీత సత్యనారాయణ తెలిపారు. కొన్ని లైసెన్స్డ్ సంస్థలు తయారు చేసిన నెయ్యిలో ఇతర కొవ్వులు కలిపినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించగా, మరికొన్ని సంస్థలు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 14 సంస్థల్లో తనిఖీలు చేసి, 15 నెయ్యి సాంపిల్స్‌ను సేకరించారు. వినియోగానికి పనికిరాదని గుర్తించిన 60 కిలోల నెయ్యిని అక్కడికక్కడే ధ్వంసం చేయగా, 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ నివేదికల్లో కల్తీ నిర్ధారణైతే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే వివిధ జిల్లాల్లో 65 సంస్థలను పరిశీలించి, మొత్తం 91 నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపించామని, నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు నోటీసులు జారీ చేశామని వివరించారు.

నిబంధనలు ఇవే..

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నెయ్యిలో 99.5 శాతం పాల కొవ్వు ఉండాలని, తేమ శాతం 0.5 శాతానికి మించకూడదని కమిషనర్ తెలిపారు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి కలపడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం పూర్తిగా నిషేధమన్నారు. వినియోగదారులు లైసెన్స్ ఉన్న, విశ్వసనీయ సంస్థల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని, కొనే ముందు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్, మాన్యుఫాక్చరింగ్ లేబుల్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని కమిషనర్ సూచించారు. కొనుగోలు బిల్లులను భద్రంగా ఉంచుకోవాలని, కల్తీ ఆహార పదార్థాలు లేదా లైసెన్స్ లేని విక్రయాలపై అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Next Story