మత విద్వేష, భ్రమల రాజకీయాలు ఎల్లకాలం సాగవు: సీపీఐఎం

by Vemula.Srinu Prasad |

‘‘ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజం. సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం అది ఉంటుంది. ప్రపంచంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగే కొద్దీ కమ్యూనిజాన్ని, మార్క్స్‌ రాసిన దాస్‌ ‌కాపిటల్‌ గ్రంథాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతున్నది.’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ అన్నారు...

మత విద్వేష, భ్రమల రాజకీయాలు ఎల్లకాలం సాగవు: సీపీఐఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజం. సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం అది ఉంటుంది. ప్రపంచంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగే కొద్దీ కమ్యూనిజాన్ని, మార్క్స్‌ రాసిన దాస్‌ ‌కాపిటల్‌ గ్రంథాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతున్నది. సీపీఎం గ్రామ స్థాయి నుంచి బలాన్ని పెంచుకునే పనిలో ఉంది. మూడు నెలల పాటు గ్రామాలు, బస్తీల్లో ప్రజలను కలిసే కార్యక్రమాన్ని రూపొందించాం. మత, ప్రాంత, కుల, డబ్బు, ప్రలోబాలతో చట్టసభల్లో తమకు సీట్లు తగ్గిన మాట వాస్తవమే. అయితే, వాటి పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు క్రమంగా తొలగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేము బలంగా పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతాం. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేస్తాం’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లో ప్రెస్‌‌క్లబ్‌ ‌హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ‌ది ప్రెస్‌‌లో జాన్‌‌వెస్లీ పాల్గొని మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆధారితంగా ఏర్పడిన 12 ఏండ్ల తెలంగాణలో ప్రజల ఆకాంక్ష‍లు నెరవేరలేదనీ, అట్టడుగు వర్గాల ప్రజల బతుకులు మారలేదని స్పష్టం చేశారు. ప్రాధాన్యతా క్రమంలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వెళ్తే లక్ష‍లాది ఎకరాలకు సాగునీళ్లు అందేవని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పాలక వర్గాలకు ఏటీఎమ్‌‌లుగా మారాయని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కారు వైఫల్యం చెందిందనీ, రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంపై కేంద్రంపై ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు.

ఓట్లు కావాలా.. ప్రయోజనాలు పట్టవా?

తెలంగాణ ప్రజల ఓట్లు కావాలిగానీ వారి ప్రయోజనాలు పట్టవా? అని ఆయన నిలదీశారు. నవోదయ స్కూళ్లు, యూనివర్సిటీలను తీసుకురావడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి అన్నదాతలు పండించిన పంటల్ని కొనలేని పరిస్థితిలో పాలకులు ఉన్నారనీ, అన్నదాతలకు ఆదుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విమర్శలకు పరిమితం అవుతున్నాయని విమర్శించారు. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టాన్ని విస్తరిస్తామనే హామీని తెలంగాణ సర్కారు విస్మరించిందని ఎత్తిచూపారు. మరోవైపు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రూ.12,13 వేల వేతనాలతో లక్ష‍లాది మంది కార్మికులు బతుకులు వెళ్లదీస్తున్నారని వాపోయారు. అలాంటి కార్మికులను ఆదుకోకుండా 12 గంటలు పనిచేయాలనీ, జీతాలు, సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యాలకు వ్యతిరేకంగా సమ్మెలు చేయొద్దని చట్టాలు రూపొందిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం మాట మార్చింది..

‌గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పి తర్వాత మాట మార్చిందనీ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లక్ష‍లాది మంది ఉద్యోగాలు పోయే నిర్ణయాలు చేస్తున్నదనీ, ఏడాదిలోనే రెండు లక్ష‍ల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్‌ ‌సర్కారు విస్మరించిందని విమర్శించారు. తమలా కూలినాలి పనులు చేయొద్దని లక్ష‍లాది రూపాయలు దారబోసి పిల్లల్ని చదివిస్తే వారికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొందనీ, చివరకు అడ్డాకూలీలు, సెక్యూరిటీ గార్డులు, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్‌ వేదికలపై పనిచేయాల్సి దుస్థితి నెలకొందని వాస్తవ పరిస్థితిని ఎత్తిచూపారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పోడు రైతులకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్ష‍ల మంది పేదలకు ఇండ్లు లేవనీ, వారికి స్థలాలిచ్చి ఇండ్లు కట్టిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అట్టడుగు వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సమాజం రావాలని ఆకాంక్ష‍ించారు. జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలివ్వాలని కోరారు.

Next Story