సీపీఐ దేశవ్యాప్త సమరభేరి.. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ

by Vemula.Srinu Prasad |

కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం తప్ప ప్రజలకు సంబంధించి ఏ ఒక్క వర్గానికి కూడ న్యాయం చేయకపోగా, ఏ రాముడి పేరుని వాడుకుని అధికారంలోకి వచ్చారో అదే దేవుడిని కూడ మోసం చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహాం వ్యక్తం చేశారు...

సీపీఐ దేశవ్యాప్త సమరభేరి.. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: 12 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం తప్ప ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏ రాముడి పేరైతే వాడుకుని అధికారంలోకి వచ్చారో అదే దేవుడిని కూడా మోసం చేశారని ఆయన ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహా, పశ్వపద్మలతో కలిసి ‘బదలావ్ జరూరీ హై’ పోస్టర్‌ను రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని సీపీఐ నిర్ణయించిందన్నారు.

ఇందులో భాగంగా దేశవ్యాప్త పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రతి గల్లీ, పట్టణం, నగరాల్లో పెద్ద ఎత్తున పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కోట్లాది మంది ప్రజలను కలిసి ప్రభుత్వ విధానాలను ఎండగడుతామని తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1న దేశ రాజధాని ’చలో ఢిల్లీ’ కార్యక్రమం ద్వారా మహా ర్యాలీని నిర్వహించనున్నమన్నారు. దేశంలో మార్పు కోసం, ప్రజా రక్షణ కోసం చేపట్టే ఈ ’చలో ఢిల్లీ’ ర్యాలీని పాదయాత్రలను జయప్రదం చేయాలని ప్రజలకు, కార్మిక వర్గాలకు విజ్ఞప్తి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ముడి చమురు ధరలు పెరిగాయని దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్,ను ధరలను విపరీతంగా పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ అదే ముడి చమురు ధరలు 40 శాతం తగ్గగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ లీటర్ డీజిల్ కేవలం 3 రూపాయలు తగ్గించి ప్రజలను ముష్టి వేసినట్లు అవహేళన చేస్తోందని విమర్శించారు.

అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు పదే పదే భారాలు మోపిన కేంద్రం, ఇప్పుడు ధరలు తగ్గినప్పుడు ఆ మేరకు ఇక్కడ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ప్రతిఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం అవి ఇవ్వకపోగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ’మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ స్థానంలో వీబీజీ- రామ్ జీ విధానాన్ని తీసుకువచ్చి, గ్రామీణ ప్రజలు, వ్యవసాయ కార్మికుల నోట్లో మట్టి కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడి పేరు చెప్పి అధికారంలోకొచ్చిన బీజేపీ విరాళాల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేసి, చివరికి ఆ రాముడికే టోపీ పెట్టారని విమర్శించారు. ఈఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ప్రతి గుడిసెకూ పట్టా.. పేదలందరికీ ఇల్లు: కూనంనేని సాంబశివరావు

రాష్ట్రంలో ‘ప్రతి గుడిసెకూ పట్టా..ప్రతి పేదవాడికీ ఇల్లు’ నినాదంతో వాటిని సాధించేవరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అవిశ్రాంత ఉద్యమాలను చేపడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద వర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్షంగా సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, సీపీఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే గతనెల 27న వరంగల్ జిల్లా దిగ్భంధనం, ఈ నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్లు, ఎమ్మార్వో కార్యాలయాల ముందు నిరనసలు వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. రెండో దశ ఉద్యమంగా ఈనెల 6వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద లక్షలాదిమందితో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో పేదలకు వేసుకున్న ప్రతి గుడిసెలకు పట్టాలను ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఎవరూ చేయాలని ఈ పనిని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. అలా కాకుండా గుడిసెలనే తొలగిస్తామనుకుంటే ఈ చర్యలను అడ్డుకోవడానికి ఎంతటి ఉద్యమాలకైన వెనకడబోమని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులను, పేదలకు సాగు హక్కు పత్రాలు (పట్టాలు) అందజేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో కాస్తు దారుల కాలాన్ని తొలగించి తరతరాలుగా భూములను దున్నుకుని బతుకుతున్న నిరుపేదలకు వాటిపై హక్కులే కుండా చేసిందని, ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతిలో సైతం కాలాన్ని ఇప్పటీ వరకు చేర్చకపోవడం అన్యాయమని, దీనిని వెంటనే పొందుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

సింగరేణిపై శ్వేత పత్రం విడుదల చేయాలి

సింగరేణి సంస్థలో కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ’శ్వేతపత్రం’ విడుదల చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వలకు సంబంధించి తప్పుడు లెక్కలు రాసి గందరగోళానికి కారణమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణికి విద్యుత్ సంస్థలు, ప్రభుత్వం నుండి దాదాపు రూ.56 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవైపు లాభాల పంపిణీ అంటూనే, మరోవైపు నష్టాల పేరుతో గనులను మూసివేయడం, కార్మికులను తొలగించాలనుకోవడంపై తీవ్ర గందరగోళం నెలకొందని విమర్శించారు. సంస్థ నిర్వహణ బాధ్యతలను అధికారులకే వదిలేయాలని, రాజకీయ జోక్యం తగ్గించాలని కోరారు. హరీష్ రావు అంతిమంగా నేను చెప్పిన విషయాన్ని అంగీకరించినందుకు సంతోషమన్నారు. హస్పిటల్స్, పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు, సర్వీస్ సెక్టార్ లో పనిచేస్తున్న కార్మికులకు సైతం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story