- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముషీరాబాద్ స్కూల్లో సమస్యలు: సీఎంకి జాన్ వెస్లీ లేఖ
ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు....

దిశ, తెలంగాణ బ్యూరో: ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి జాన్ వెస్లీ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను వెల్లడించారు.
నిధులు విడుదల చేయకపోవడంతో..
‘ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 800లకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. గదులు సరిపోకపోవడంతో 2021లో ప్రారంభించిన అదనపు భవన నిర్మాణానికి రూ.4.5 కోట్లు కేటాయించినప్పటికీ, నిధులు విడుదల చేయకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తరగతి గదుల కొరత ఏర్పడి, పాఠశాలను రెండు షిఫ్టుల్లో నడుస్తున్నది. ఉదయం 8 నుండి మధ్యాహ్నం వరకు ప్రైమరీ స్కూలు, మధ్యాహ్నం తర్వాత హైస్కూలు నడుపుతున్నారు. దీనివల్ల విద్యార్థుల విద్యా సమయం తగ్గుతోంది. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఇరుకైన గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే భవన నిర్మాణ నిధులు విడుదల చేయాలి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వాష్‌రూమ్‌లు లేవు. చాలా వాష్‌రూమ్స్‌ల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బకెట్స్‌తో నీటిని తీసుకెళ్తున్నారు. కొన్ని మరుగుదొడ్లకు డ్రైనేజ్ సౌకర్యంలేదు. వర్షపు నీరు పాఠశాల ఆవరణలో నిలవడంతో చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పాటు పాఠశాల ప్రాంగణంలోకి బయటి వాహనాలను పార్కు చేయడంతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. పాఠశాలలో ఇంగ్లీష్, ఉర్దూ, బయాలజీ, పీఈటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఈ ఖాళీలను భర్తీ చేయాలి. కంప్యూటర్ ల్యాబ్‌లో 12 కంప్యూటర్లలో 9 మాత్రమే పని చేస్తున్నాయి. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ లేకపోవడం వల్ల విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరమవుతున్నారు.’ అని జాన్ వెస్లీ తెలిపారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైనా...
‘విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. మధ్యాహ్న భోజన నిర్వహణ నాణ్యత అధ్వాన్నంగా ఉంది. నాణ్యమైన ఆహారం అందక, విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి ఏటా 20 శాతం నిధులు కేటాయించాలి. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని పాఠశాలలను కుదించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.’ అని జాన్ వెస్లీ తన లేఖలో పేర్కొన్నారు.






