చైన్ స్నాచర్‌ను పట్టించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్‌కు సీపీ సజ్జనార్ సత్కారం

by Ratna Kumari |

చైన్ స్నాచింగ్‌కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని నగర పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనార్ అభినందించారు.

చైన్ స్నాచర్‌ను పట్టించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్‌కు సీపీ సజ్జనార్ సత్కారం
X

దిశ, సికింద్రాబాద్ : చైన్ స్నాచింగ్‌కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని నగర పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనార్ అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో రాముడిని ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువా కప్పి సన్మానించి నగదు బహుమతి అందజేశారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14న అంబర్‌పేట ఇరానీ హోటల్ బస్‌స్టాప్ వద్ద బస్సు దిగుతున్న సమయంలో రాముడి మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. తన వయస్సును పట్టించుకోకుండా రాముడు ధైర్యంగా ఎదుర్కొని నిందితుడిని పట్టుకున్నాడు. వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తక్షణమే చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


పోలీసుల విచారణలో నిందితుడు మల్లేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ మన్నన్‌గా గుర్తించారు. ఇతని పై తెలంగాణ వ్యాప్తంగా 31 పాత కేసులు ఉన్నట్లు వెల్లడి అయింది. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉండగా.. మంగళ్‌హాట్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని అనుచరులు కోటేష్, మల్లేష్ పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా అంబర్‌పేట ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు దినేష్ రెడ్డి, భరత్ కుమార్‌ల పనితీరును కూడా సీపీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ఒకసారి సైనికుడు ఎప్పుడూ సైనికుడే అని రాముడు నిరూపించాడని ప్రశంసించారు. సమాజంలో ప్రతి పౌరుడు నేరాల నియంత్రణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story