మూసీ రక్షణకు హైడ్రా హస్తం.. జోన్-3 సీవర్ నెట్‌వర్క్ సిద్ధం

by Naga Rani Yarlagadda |

మూసీన‌దికి ఉత్తరం వైపున కోర్ సిటీలో సీవ‌రేజి వ్యవ‌స్థ ఆధునికీకరణ కోసం జోన్-3 సీవ‌ర్ నెట్‌వ‌ర్క్ ప్రాజెక్టు ప‌నులు వేగంగా జరుగుతున్నాయి. 4 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 33.50 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల విస్తీర్ణానికి సంబంధించి రూ.297 కోట్ల వ్యయంతో జోన్-3 సీవ‌ర్ నెట్‌వ‌ర్క్ ప్రాజెక్టులో మొత్తం 135 కిలోమీట‌ర్ల పొడ‌వైన పైప్‌లైన్ నిర్మాణాన్ని జ‌ల‌మండ‌లి చేప‌డుతున్నది.

మూసీ రక్షణకు హైడ్రా హస్తం.. జోన్-3 సీవర్ నెట్‌వర్క్ సిద్ధం
X

దిశ, సిటీ బ్యూరో : మూసీన‌దికి ఉత్తరం వైపున కోర్ సిటీలో సీవ‌రేజి వ్యవ‌స్థ ఆధునికీకరణ కోసం జోన్-3 సీవ‌ర్ నెట్‌వ‌ర్క్ ప్రాజెక్టు ప‌నులు వేగంగా జరుగుతున్నాయి. 4 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 33.50 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల విస్తీర్ణానికి సంబంధించి రూ.297 కోట్ల వ్యయంతో జోన్-3 సీవ‌ర్ నెట్‌వ‌ర్క్ ప్రాజెక్టులో మొత్తం 135 కిలోమీట‌ర్ల పొడ‌వైన పైప్‌లైన్ నిర్మాణాన్ని జ‌ల‌మండ‌లి చేప‌డుతున్నది. న‌గ‌రంలోని ఓల్డ్ సిటీలో ఉన్న గోషామ‌హ‌ల్, నాంప‌ల్లి, కార్వాన్‌తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సీవ‌రేజి వ్యవ‌స్థను ఆధునికీక‌రించ‌డానికి ఈ ప్రాజెక్టు చేప‌ట్టింది. ఈ ప్రాజెక్టు పనులు 98శాతం పూర్తయ్యాయి. దీంతోపాటు మురుగునీరంతా మూసీలోకెళ్లకుండా అడ్డుకట్టవేయడానికి ఉపయోగపడుతున్నది.

ప్రాజెక్టు ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాలివే..

టోలిచౌకి, గోల్కొండ‌, లంగ‌ర్‌హౌజ్‌, సెవెన్‌ టూంబ్స్‌, జూబ్లీహిల్స్(కొంత భాగం), మెహ‌దీప‌ట్నం, నాన‌ల్‌న‌గ‌ర్‌, ఆసిఫ్ న‌గ‌ర్‌, విజ‌య్‌న‌గ‌ర్ కాల‌నీ, ఎన్ఎండీసీ కాల‌నీ, మాస‌బ్ ట్యాంక్‌, రెడ్ హిల్స్‌, ల‌క్డీకాపూల్‌, బ‌జార్‌ఘాట్‌, నాంప‌ల్లి, మ‌ల్లేప‌ల్లి, బేగంబ‌జార్‌, త‌దిత‌ర ప్రాంతాలు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. ప్రాజెక్టు పురోగతి మొత్తం పైపులైన్ పొడ‌వు 135 కిలోమీట‌ర్లు కాగా.. ఇప్పటి వ‌ర‌కు 133 కిలోమీట‌ర్ల మేర నిర్మాణం పూర్తయింది. ఇందులో 200-300 డ‌యా పైపు లైన్ ప‌నులు పూర్తికాగా, 4 కిలోమీట‌ర్లు ట్రంక్ మెయిన్లు నిర్మాణం పురోగ‌తిలో ఉన్నాయి. 12 ప్రాంతాల్లో 9 మీట‌ర్లు ట‌న్నెలింగ్ ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే సీవ‌రేజ్ వ్యవ‌స్థ పరిధి పెరుగుతుంది. ప్రాజెక్టు ప‌రిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేక‌ర‌ణ జ‌రుగుతుంది. ప్రాజెక్టు ప‌రిధిలోని ప్రాంతంలో నాలాల్లోకి, మూసీ న‌దిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండ‌దు. ఈ ప్రాంతంలో మెరుగైన‌, ఆరోగ్యక‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది.

ప్రాజెక్టు పనుల ప‌రిశీల‌న‌

కోర్ సిటీలో మురుగు నీటి వ్యవ‌స్థ ఆధునీక‌ర‌ణ‌ కోసం చేప‌ట్టిన జోన్-3 సీవ‌ర్ నెట్ వ‌ర్క్ ప్రాజెక్టు పనుల‌తోపాటు షేక్‌పేట్ జ‌ల‌మండ‌లి కార్యాల‌యాన్ని ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ప‌రిశీలించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌస‌ర్ మోహీయుద్దీన్‌తో క‌లిసి స‌మ‌స్యాత్మక‌మైన ప్రాంతాల్లో నిర్మాణ ద‌శ‌లో ఉన్న ప‌నుల్ని ప‌రిశీలించారు. మొదటగా టోలిచౌకీ ఫ్లై ఓవర్ ప్రధాన రహదారిలో చేపట్టే ట‌న్నెలింగ్ పనులను ఆటంకాలు కాకుండా ఎలా చేపట్టాలో చర్చించారు. ఈ ప్రధాన రహదారిలో ప్రతినిత్యం ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డంతో పనులు చేపట్టడం అంత సులువు కాదని అంచనా వేశారు. దాదాపు 8 నుంచి 11 మీట‌ర్లు లోతులో జ‌రిగే ట‌న్నెలింగ్ ప‌నులతో ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.. వర్షాకాలంలోపే పనులు పూర్తి చేయమని సూచించారు. ట‌న్నెలింగ్ ప‌నులు చేప‌ట్టేట‌ప్పుడు జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కో, జ‌లమండ‌లి ట్రాన్స్ మిష‌న్, ఓ అండ్ ఎం అధికారులతో స‌మ‌న్వయం చేసుకుంటూ నిర్వహించాల‌న్నారు. ప‌నులు చేప‌ట్టే స‌మ‌యంలో స‌రైన బారికేడ్లు, ర‌క్షణ ప‌రికరాల‌ను ధ‌రించి భ‌ద్రతా ప్రమాణాలు పాటించాల‌న్నారు. పైపు విస్తర‌ణ ప‌నులు పూర్తి చేసిన ప్రాంతాల్లో వెంట‌నే రోడ్డు మ‌ర‌మ్మతులు పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఎండీ సూచించారు. అక్కడి నుంచి స‌మీపంలోని 7 టూంబ్స్ వెళ్లే ర‌హ‌దారిలో చేప‌ట్టే అండ‌ర్ గ్రౌండ్ ట‌న్నెలింగ్ ప‌నుల‌ను నివాస గృహాల పటిష్ఠతకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు ఎలా చేయాలో ప్రతిపాదనలను సమర్పించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.

అనంత‌రం ఎండీ లైన్స్, పరిసర ప్రాంతాల్లో పురోగ‌తిలో ఉన్న పైపులైన్ విస్తర‌ణ ప‌నుల్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక ఎమ్మెల్యే.. వ‌ర్షాకాలం స‌మీపించిన త‌రుణంలో ప్రజ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా.. ప‌నులు చేప‌ట్టి వేగంగా పూర్తి చేయాల‌ని ఎండీ అశోక్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంత‌కుముందు షేక్‌పేట్ జ‌ల‌మండ‌లి కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. అక్కడ ప‌ది సంవ‌త్సరాల‌ క్రితం నిర్మించిన 10 మి.లీ. సామర్థ్యం క‌లిగిన రిజ‌ర్వాయ‌ర్లను ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాక‌పోవ‌డంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంట‌నే రిజ‌ర్వాయ‌ర్లను వినియోగంలోకి తీసుకుని, ఏయో ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చో స‌ర్వేచేసి వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. ఈ రిజ‌ర్వాయ‌ర్లు అందుబాటులో వ‌స్తే షేక్‌పేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రా మెరుగుప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. అనంత‌రం ఎండీ అశోక్‌రెడ్డి ఆ ప్రాంగ‌ణంలోని నీటిశుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యేతో క‌లిసి ప‌రిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుద‌ర్శన్‌, ఆప‌రేష‌న్ డైరెక్టర్ అమ‌రేంద‌ర్‌రెడ్డి, సీజీఎంలు వినోద్ భార్గవ్, రాజేంద‌ర్, జీఎంలు శ్రీను నాయ‌క్‌, కుమార్, ప్రాజెక్టు, ఓఅండ్ఎం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story