ఈవీఎంల కమిషనింగ్ షురూ.. సికింద్రాబాద్ స్థానంలో అతి పెద్ద బ్యాలెట్

by Disha Web Desk 19 |
ఈవీఎంల కమిషనింగ్ షురూ.. సికింద్రాబాద్ స్థానంలో అతి పెద్ద బ్యాలెట్
X

దిశ, సిటీ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరుగనున్న పోలింగ్ కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లలో బ్యాలెట్ పేపర్ ను పొందుపరిచే (కమిషనింగ్) ప్రక్రియ మొదలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్పా ర్లమెంట్ స్థానాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అతి పెద్ద బ్యాలెట్ పేపర్ ను రూపొందించారు. ఈ బ్యాలెట్ ను ఈవీఎంలో పొందుపరిచేందుకు మూడు బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తూ ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఈసీఐఎల్ నుంచి ప్రత్యేకంగా ఇంజనీనర్లను రప్పించినట్లు సమాచారం.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో 30 మంది, సికింద్రాబాద్ స్థానం నుంచి 45 మంది అభ్యర్థుల పేరు, ఎలక్షన్ సింబల్, వరుస సంఖ్య వంటి వివరాలతో ఈ కమిషనింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కమిషనింగ్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ కల్లా పూర్తి చేసి, దీన్ని నాలుగు అంచెలంచెలుగా క్రాస్ వెరిఫై చేశాక ఫైనల్ గా జిల్లా ఎన్నికల అధికారి బ్యాలెట్ కు ఆమోద ముద్ర వేశాక ఈ నెల 12వ తేదీ ఉదయం నుంచి డీఆర్సీ సెంటర్లలో ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ లను రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఒక్క సారి ఈవీఎంలను స్వీకరించాక పోలింగ్ ముగిసి, మళ్లీ పోలింగ్ స్టేషన్ల నుంచి ఈవీఎంలను డీఆర్సీ సెంటర్లలో అప్పగించే వరకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు నిరంతరాయంగా ఎలక్షన్ డ్యూటీలు చేయాల్సి ఉంది.

యాగ్జిలరీ పోలింగ్ స్టేషన్లు

నగరంలోని మొత్తం 3,986 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో 900కు మించి ఓటర్ల సంఖ్య ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా యాగ్జిలరీ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనికి తోడు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటర్ అసిస్టెన్స్ సెంటర్ ను సైతం ఏర్పాటు తప్పనిసరి అంటూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.

నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్లు...

నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లు

-----------------------------

ముషీరాబాద్ 276

మలక్‌పేట 300

అంబర్ పేట 236

ఖైరతాబాద్ 245

జూబ్లీహిల్స్ 329

సనత్ నగర్ 229

నాంపల్లి 277

కార్వాన్ 311

గోషామహల్ 235

చార్మినార్ 198

చాంద్రాయణగుట్ట 305

యాకుత్ పుర 332

బహదూర్ పుర 261

సికింద్రాబాద్ 220

కంటోన్మెంట్ 232

-------------------------------

మొత్తం 3986

-------------------------------

ఈవీఎంలలో బ్యాలెట్ ను కమిషనింగ్ చేస్తున్న ఎన్నికల సిబ్బంది

Next Story