మొహర్రం ఏర్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం: కవిత

by Kodari Anjali |   (  Updated:2026-06-22 16:04:27  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీబీ కా ఆలం సందర్శించారు.

మొహర్రం ఏర్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం: కవిత
X

దిశ, చంపాపేట్: మొహర్రం వేడుకల ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ముహర్రం సందర్భంగా దబీర్‌పురాలోని బీబీ కా ఆలం సందర్శించిన ఆమె, అక్కడి నిర్వాహకులు మరియు భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశూర్‌ఖానాలకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొహర్రం అనేది కర్బలా యుద్ధంలో హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అపూర్వ త్యాగాన్ని స్మరించుకునే పవిత్ర సందర్భమని పేర్కొన్నారు. సత్యం, న్యాయం, మానవతా విలువల కోసం ఆయన చేసిన త్యాగం యుగయుగాల పాటు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

ఆ నిధులు క్షేత్రస్థాయికి చేరడం లేదని..

హైదరాబాద్ నగరం శతాబ్దాలుగా సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, నిజాం కాలం నుంచే అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవభావంతో పండుగలను కలిసి జరుపుకుంటూ వస్తున్నారని కవిత గుర్తుచేశారు. చారిత్రాత్మక బీబీ కా ఆలం ఊరేగింపులో పాల్గొనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నగర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, ఆ నిధులు క్షేత్రస్థాయికి చేరడం లేదని ఆమె విమర్శించారు. మైనారిటీ సంక్షేమ పథకాలు, మొహర్రం ఏర్పాట్ల కోసం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేసి, ఆశూర్‌ఖానాలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కవిత పర్యటన సందర్భంగా స్థానిక నిర్వాహకులు, మత పెద్దలు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Next Story