- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో పంజా విసురుతున్న చలి
గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ చలి పెరుగుతున్నది. దీంతో ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ చలి పెరుగుతున్నది. దీంతో ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతినిత్యం కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా చలి తీవ్రత పెరిగి చిన్న పిల్లలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఆస్తమా, బ్రాంకె టీస్, కీళ్ల నొప్పులు, చర్మం పొడిగా మారి పగుళ్లు రావడం, ఛాతిలో నెమ్ము చేరడం వంటి సమస్యలతో బాధ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటివి అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చలి ప్రభావం చిన్న పిల్లలపై అధికంగా చూపుతున్నది. ఫలితం గా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగింది. చిన్న పిల్లల దవాఖానలు కిటకిటలాడుతుండగా పాఠశాలల్లో సైతం విద్యార్థుల హాజరు శాతం తగ్గుతుంది.
అలర్జీ లక్షణాలు..
గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న చలి కారణంగా పిల్లలు, వృద్ధుల్లో అలర్జీ లక్షణాలు అధికంగా కనబడుతున్నాయి. కాళ్లు, చేతులపై చర్మం ముడత పడటం తో పాటు కీళ్ల సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలో శ్వాస కోశ సమస్యలు కన్పిస్తున్నాయి. చర్మం పొడిబారడం కారణంగా దురద, మంటతో పాటు పగుళ్లు ఏర్పడుతున్నా యి. చాలా మందిలో జ్వరం లక్షణాలు కనబడుతుండడంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా చాలామంది చలి కాలంలో వచ్చే గురక తో ఇబ్బందులు పడుతుండడంతో రాత్రి పడుకునే ముందు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
ముందు జాగ్రత్తలు తప్పనిసరి..
చలి కాలంలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలను చలిగాలిలో తిప్పకుండా వెచ్చని వాతావరణంలో ఉండే లా తల్లిదండ్రులు చూడాలి. వారిని తప్పనిసరై బయటకు తీసుకువెళ్లాల్సి వస్తే తలకు మంకీ క్యాప్, ఒంటికి స్వె టర్ వేయడం తప్పనిసరి. చలి గాలులు ఎక్కువగా వీచే సమయంలో ఎముక లు, జాయింట్లు, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబు తో పాటు చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అంతేకాకుండా బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచాలి..
చలి తీవ్ర ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆకుకూరలు, గుడ్లు , పాలు, పప్పుల వంటివి అధికంగా తీసుకోవాలి. చలికాలంలో పొగమంచు అధికంగా ఉన్న సమయంలో చాలా మంది వ్యాయామం, నడక వంటివి తెల్లవారుజామున చేస్తుంటారు. ఇలా చేయడంతో లాభం కంటే నష్టమే ఎక్కువని, చలి, మంచు లో నడక శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. అవకాశం ఉన్న వారు ఉదయం తొమ్మిది గంటల తర్వాతే బయటకు రావాలని, సాయంత్రం 5 గంటల లోపు ఇండ్లకు చేరుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రయాణాలకు తప్పని వెతలు..
ఉదయం వేళల్లో రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడం తో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి రోజూ ఉదయం నుంచి చల్లటి గాలులు మొదలవుతుండగా సాయంత్రం 6 గంటల తర్వాత చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో త్వరగానే పనులు ముగించుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ రోడ్ల పై పని చేసే పారిశుధ్య కార్మికులు, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్ పడుతున్న బాధలు వర్ణనాతీతం.






