ఫుట్‌పాత్‌లపై మళ్లీ వ్యాపారాలు!

by velandi.Saikiran |   (  Updated:2026-05-07 22:30:28  IST  )

ఫుట్‌పాత్ ఆక్రమణల సమస్య మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఫుట్‌పాత్‌లపై మళ్లీ వ్యాపారాలు!
X

ఫుట్‌పాత్‌లపై మళ్లీ వ్యాపారాలు!

ఆక్రమణలను కూల్చివేసినా మారని తీరు

డ్రైవ్‌ల తర్వాత మళ్లీ పాత దృశ్యాలు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాదచారులు

జీహెచ్ఎంసీ చర్యలపై ప్రజల్లో ఆగ్రహం

స్ట్రీట్ వెంటర్ జోన్లు లేకపోవడంతో వ్యాపారుల ఆవేదన

దిశ, ఖైరతాబాద్ : ఫుట్‌పాత్ ఆక్రమణల సమస్య మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. నగరంలోని అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ స్టాల్స్, తాత్కాలిక దుకాణాలు, అనధికార నిర్మాణాలను తొలగించారు. కొన్ని రోజుల పాటు ఫుట్‌పాత్‌లు స్వచ్ఛంగా కనిపించడంతో పాదచారులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఆ పరిస్థితి ఎక్కువకాలం నిలవలేదు. డ్రైవ్ ముగిసిన కొద్ది రోజులకే మళ్లీ పాత పరిస్థితులు తిరిగి కనిపించాయి. తొలగించిన చోట్లే మరోసారి వ్యాపారాలు ప్రారంభమవ్వడంతో ప్రజలు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నట్లు హడావిడి మాత్రమే తప్ప శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

డ్రైవ్‌లకే పరిమితమవుతున్న చర్యలు..

స్థానికుల ఆరోపణల ప్రకారం.. అధికారులు ఒక్కసారిగా వచ్చి డ్రైవ్ నిర్వహించి వెళ్లిపోతున్నారు. కానీ తరువాత పరిస్థితిని పర్యవేక్షించే వ్యవస్థ కనిపించడం లేదని అంటున్నారు. కొందరు కింది స్థాయి సిబ్బందికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సహకరించే వ్యాపారులపై సడలింపులు, మిగతావారిపై చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

పాదచారులకు ఇబ్బందులు..

ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమించబడడంతో ప్రజలు రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఇది ప్రమాదాలకు కారణమవుతోంది. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఫుట్‌పాత్‌ల అవసరం మరింత పెరిగినా వాటి రక్షణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. జీవనోపాధి కోసం ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేయక తప్పడం లేదని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. సరైన హాకర్ జోన్లు, మార్కెట్ స్థలాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు పేర్కొంటున్నారు.

శాశ్వత పరిష్కారమే మార్గం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమస్యకు తాత్కాలిక డ్రైవ్‌లు సరిపోవు. ఆక్రమణలపై కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు, నిరంతర పర్యవేక్షణ అవసరం. అదే సమయంలో చిన్న వ్యాపారులకు ప్రత్యేక హాకర్ జోన్లు, పునరావాస సదుపాయాలు కల్పిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story