మెహదీపట్నంలో ఇండ్ల దొంగ అరెస్ట్..

by Kodari Anjali |

మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇండ్ల దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

మెహదీపట్నంలో ఇండ్ల దొంగ అరెస్ట్..
X

దిశ, కార్వాన్: మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇండ్ల దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఒక పాత నేరస్థుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి రూ. 10 లక్షల విలువైన 157.8 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక యాక్టివా ద్విచక్ర వాహనం, రూ. 12,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం... సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లికి చెందిన బియ్య శశిధర్ (28) ఉబర్ బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి మాసాబ్ ట్యాంక్ పి.ఎస్. నగర్‌లోని సిరి ప్రియ రెసిడెన్సీలో నివసించే రజిత శ్రీనివాస్ గొడారి మేనకోడలితో పరిచయం ఉంది. ఆ పరిచయంతో రజిత ఇంటికి తరచూ వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లోని అల్మారాలో ఉన్న విలువైన వస్తువులను గమనించాడు.

ఆ సొత్తును సికింద్రాబాద్ గోల్డ్ మార్కెట్‌లో విక్రయించి..

గత నెల 30న రజిత కారును విక్రయించడంలో సహాయం చేస్తానని నమ్మించి ఆమె గదిలోకి ప్రవేశించాడు. కారు తాళాల కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ, అల్మారా తాళాలు దొరకడంతో అందులోని బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అనంతరం ఆ సొత్తును సికింద్రాబాద్ గోల్డ్ మార్కెట్‌లో విక్రయించి, గోవా పారిపోయి జులాయిగా గడిపాడు. నిందితుడు తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడనే నమ్మదగిన సమాచారంతో, విజయ్ నగర్ కాలనీలోని అల్-సభా హోటల్ వద్ద మెహదీపట్నం క్రైమ్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచి నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న మెహదీపట్నం ఎస్‌హెచ్‌ఓ ఎస్. మల్లేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రాంబాబు, క్రైమ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి, పారితోషికాలు ప్రకటించారు.

Next Story