- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పేపర్ లీక్ పై ప్రశ్నించిన బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జంగయ్య, నరేష్, సాయికుమార్‌లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని విద్యార్థి నాయకులు ఆరోపించారు.

దిశ, సికింద్రాబాద్ : నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జంగయ్య, నరేష్, సాయికుమార్‌లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు.
2024లో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటన నుంచి కేంద్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమైందని విమర్శించారు. జాతీయ అర్హత పరీక్షల నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న అసమర్థత విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. ప్రశ్నాపత్రం లీక్ కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను మళ్లీ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






