- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీపుల్స్ చార్జ్ షీట్ విడుదల చేస్తాం: సీఎంకు Brs Mlc వార్నింగ్
సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదని.. భవిష్యత్ తరాల సంపదను దోచుకునే ప్రజా దోపిడీ పాలన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ...

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదని.. భవిష్యత్ తరాల సంపదను దోచుకునే ప్రజా దోపిడీ పాలన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవి కావని.. రాష్ట్ర సంపదను కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి అప్పగించే కుట్రలో భాగమని విమర్శించారు. ప్రజల భూములు, పరిశ్రమలు, రైతుల హక్కులు, ప్రభుత్వ ఆస్తులు అన్నీ ఒక పెద్ద వ్యాపార ఒప్పందంలో భాగంగా మారిపోయాయని ఆరోపించారు. రేవంత్ రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నారని మండిపడ్డారు. ఒకే భూమిని ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి, తిరిగి అదే భూమిని ప్రభుత్వమే మరొకరికి కేటాయించడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ఇది క్రిమినల్ చర్య అని అన్నారు. సాధారణ వ్యక్తి చేస్తే జైలుకు వెళ్లాల్సిన పని అని.. అదే చర్యను సీఎం హోదాలో ఉండి చేయడం మరింత ప్రమాదకరమని అన్నారు. తాను గతంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేశానని చెప్పుకునే రేవంత్‌రెడ్డికి కనీసం ఆ వృత్తిలో ఉండే నైతిక విలువలు సైతం లేవని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులను విక్రయించే బ్రోకర్‌గా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామిక ప్రాంతాలను ఖాళీ చేయించి వేలాది ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పగించేందుకు ప్రభుత్వం రూపొందించిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ కన్వర్షన్ స్కామ్ అని ఆరోపించారు. సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను ఎలాంటి సమగ్ర పర్యావరణ ప్రభావ అధ్యయనం లేకుండా ఇతర అవసరాలకు మళ్లించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ఇప్పటికే పనిచేస్తున్న 2,800 పరిశ్రమల్లో దాదాపు 1,100 పరిశ్రమలు కాలుష్యం కలిగించనివే అయినప్పటికీ వాటిని కూడా బలవంతంగా తరలించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదని పేర్కొన్నారు. భూముల విక్రయం, పారిశ్రామిక విధ్వంసం, రైతు వ్యతిరేక చర్యలు, అవినీతి ఆరోపణలపై త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పీపుల్స్ చార్జ్ షీట్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.






