- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శవాల దగ్గర లంచాల లడాయ్!
గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద పోస్టుమార్టమ్ కోసం లంచం డిమాండ్ చేసిన విషయంపై డాక్టర్లు, పోలీసుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది.

దిశ, సిటీ క్రైం: గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద పోస్టుమార్టమ్ కోసం లంచం డిమాండ్ చేసిన విషయంపై డాక్టర్లు, పోలీసుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. డ్యూటీ డాక్టర్ లంచం కోరాడని పోలీసులు ఆరోపించగా, తమతో పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని డాక్టర్లు కౌంటర్ ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులతో మార్చురీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
లంచం ఇస్తేనే పోస్టుమార్టం
జూన్ 28న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన క్రైం నెం. 677/25 కేసులో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ఓ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకువెళ్లారు. క్రైం సీన్ ఫొటోలు, ఇతర ఆధారాలతో కలిసి పోస్టుమార్టమ్ చేయాలని డ్యూటీ డాక్టర్‌ను కోరారు. అయితే, డాక్టర్ రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు. తమ దగ్గర డబ్బులు లేవని చెప్పినా డాక్టర్ స్పందించలేదని, చివరికి ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించిన తర్వాతే పోస్టుమార్టమ్ చేపట్టినట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రూ.4 వేలు లంచం డిమాండ్
జులై 2న చోటు చేసుకున్న మరో ఘటనలో, సైబరాబాద్‌కు చెందిన ఓ ఎస్‌ఐ, కానిస్టేబుల్ మే 31న ఓ మృతదేహాన్ని రాత్రి మార్చురీకి తీసుకెళ్లారు. డ్యూటీ డాక్టర్ రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వారు ఆరోపించారు. డబ్బులు లేవని చెప్పినా డాక్టర్ పట్టించుకోలేదని, చివరకు చాలాసార్లు ఫోన్ చేసిన తర్వాతే పోస్టుమార్టమ్‌కు అంగీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మానసికంగా వేధించారంటూ వారు మెడికల్ సైన్సెస్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
పోలీసులపై వైద్యుల ఫిర్యాదు
జులై 9న, పోలీసు అధికారుల వైఖరిపై మార్చురీ వైద్య సిబ్బంది డీజీపీ, సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తమతో ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించాడని, మెడికో లీగల్ కేసుల డ్యూటీ నుంచి ఆయనను తొలగించాలని కోరారు.
చర్యలు తీసుకునేదెప్పుడు?
ఈ ఫిర్యాదులు బహిర్గతమైన నేపథ్యంలో, గాంధీ మార్చురీ వద్ద ‘లంచం లేకుండా పోస్టుమార్టమ్ జరగదా?’ అనే చర్చ కొనసాగుతోంది. మృతుల కుటుంబ సభ్యులు లంచం చెల్లించకపోతే పోస్టుమార్టమ్ ఆలస్యమవుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు డాక్టర్లతో పోలీసులు సక్రమంగా వ్యవహరించడంలేదన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో ఉంది. వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






