డ్రగ్స్ మత్తులో బాక్సర్ వజీర్.. ఈగల్ విచారణతో వెలుగులోకి

by Kodari Anjali |

గోవా ప్రయాణంలో పరిచయమైన యువతి స్నేహంతో ఓ మహిళ డ్రగ్స్‌కు బానిసైంది.

డ్రగ్స్ మత్తులో బాక్సర్ వజీర్.. ఈగల్ విచారణతో వెలుగులోకి
X

దిశ, సిటీక్రైం: గోవా ప్రయాణంలో పరిచయమైన యువతి స్నేహంతో ఓ మహిళ డ్రగ్స్‌కు బానిసైంది. మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నెం. 3 లో అనుమానస్పదంగా తిరుగుతుండగా ఈగల్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె వద్ద ఎండిఎంఏ, ఎల్ ఎస్డి బ్లాట్స్ డ్రగ్స్ దొరికాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన హస్సా(47) 2024 సంవత్సరం డిసెంబరు నెలలో గోవాకు బస్సులో హైదరాబాద్ నుంచి వెళ్తుండగా అందులో ప్రయాణిస్తున్న బోయిన్ పల్లి ప్రాంతానికి చెందిన మీనా, కిరణ్ లు పరిచయమయ్యారు. అలా స్నేహితులుగా మారి వీరు గోవాలోని మర్ మెయిడ్ హోటల్‌లో ఉన్నారు. అక్కడ మీనా ఫ్రెండ్ రోమి భరత్ కల్యాణి వచ్చి డ్రగ్స్ ఇచ్చాడు.

అలా డ్రగ్స అలవాటుకు పడిన హస్సా నేరుగా గోవాకు చెందిన రోమి భరత్‌తో డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ సంవత్సరంలో మే, జూలై, అక్టోబరు, డిసెంబరు నెలలో హస్సా రోమి భరత్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులకు విచారణలో తెలిపింది. ఇలా తీసుకువచ్చిన డ్రగ్స్‌ను హస్సా తన స్నేహితులైన సుమిహా ఖాన్, బాక్సర్ వజీర్‌లతో కలిసి సేవించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. హస్సాకు డ్రగ్స్ కిట్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. హస్సాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న రోమి భరత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రోమి భరత్ గతంలో ఆదిబట్ల, పంజాగుట్ట, గోల్కోండ పోలీసులకు ఎన్ డి పీ ఎస్ కేసులలో అరెస్టు అయ్యి జైలు నుంచి విడుదలై తిరిగి డ్రగ్స్ దందాను చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

10 రోజులలో 23 మంది వినియోగదారులు అరెస్టు...

న్యూఇయర్ స్వాగతపు వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఈగల్ గట్టి నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈగల్ 10 రోజులలో 27 డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న స్మగ్లర్‌లను, 23 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో ఐదుగురు విదేశి మహిళలు కూడా ఉన్నారు. 68 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండిఎంఏ, 2 గ్రాముల ఎల్ఎస్డి బ్లాట్స్, 381 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువత, విద్యార్ధులు ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈగల్ హెచ్చరిస్తుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మీ పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. ప్రజలు కూడా మీకు డ్రగ్స్, గంజాయి వంటి దందా, సరఫరాపై సమాచారం ఉంటే 1908 ఈగల్ టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Next Story