- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాహిత్య విమర్శకు వస్తు, శిల్పాలు రెండూ అవసరమే
సాహిత్య విమర్శకుడికి ఒక దృక్పథం ఉంటుందని, అది రచనలోని ఉత్తమ లక్షణాలను నిరోధించేలా ఉండకూడదని, సాహిత్య విమర్శకు వస్తు, శిల్పాలు రెండూ అవసరమేనని హెచ్సీయూ తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.

దిశ, శేరిలింగంపల్లి : సాహిత్య విమర్శకుడికి ఒక దృక్పథం ఉంటుందని, అది రచనలోని ఉత్తమ లక్షణాలను నిరోధించేలా ఉండకూడదని, సాహిత్య విమర్శకు వస్తు, శిల్పాలు రెండూ అవసరమేనని హెచ్సీయూ తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వారు ఆదివారం అరసం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రచయిత వల్లూరి శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాల సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అభ్యుదయ సాహిత్య విమర్శకుడుగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య అనే అంశంపై ప్రసంగించారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో తనదైన ముద్ర వేసిన వల్లంపాటి సాహిత్య సిద్ధాంతాలు, పాశ్చాత్య సాహిత్య విమర్శ మౌలికాంశాలను లోతుగా అధ్యయనం చేసిన ఉత్తమ విమర్శకుడని అన్నారు.
రాయలసీమ భౌగోళిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మూలాలను ఆధారం చేసుకొని సామాజిక, సాంస్కృతిక దృక్పథంతో సాహిత్యాన్ని అనుశీలించడం నేర్చిన సైద్ధాంతిక విమర్శకుడని తెలిపారు. వల్లంపాటి రాసిన కథా శిల్పం, నవలా శిల్పం, విమర్శ శిల్పం, ఇతర వ్యాసాలు సాహిత్య విమర్శకారులకు దారి దీపాలని, ఆయన అనువదించిన గ్రంథాలన్నీ చరిత్ర, సామాజిక సాహిత్య రంగాలలో అభ్యుదయకరమైన ఆలోచనలకు ప్రేరకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డా.పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం సోషల్ మీడియా కార్యనిర్వహక కార్యదర్శి ఎ.ఎమ్.ఆర్. ఆనంద్, ప్రముఖ రచయిత వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి, డా.బడిగె ఉమేశ్, డా. పెద్దింటి ముకుందరావు, డా. బాసెట్టి లత, డా.రామ్ ప్రసాద్ నలసాని, కె.పి. అశోక్ కుమార్, యు.అప్పలరాజు, ఎం.జయదేవ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.






