అంబేడ్కర్ వర్సిటీపై నోరుమెదపరా?

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆస్తులు, అప్పుల పంపకాల సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు.

అంబేడ్కర్ వర్సిటీపై నోరుమెదపరా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆస్తులు, అప్పుల పంపకాల సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది విద్యార్థులకు సేవలు అందించిన ఈ వర్సిటీలో విభజన ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోవడంతో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్నది. వర్సిటీ హెడ్ క్వార్టర్స్‌ను ఏపీలోని ఏలూరు జిల్లాకు మారుస్తున్నట్టు ఈ ఏడాది మే నెలలో ఏపీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదే పేరుతో కొత్త యూనివర్సిటీ సైతం ఏర్పాటు చేసింది.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం,వర్సిటీ అధికారులు నోరుమెదపకపోవడంపై విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

ఒకే పేరుతో మరో వర్సిటీనా?

నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పేరుతో మరొక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకోవడం కొత్త వివాదాలకు దారితీసింది. వర్సిటీ నిబంధనలు, చట్టపరమైన పరిమితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై విద్యావేత్తలు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ గెజిట్ కావాలి. కానీ అదేమీ లేకుండా ఏపీలో యూనివర్సిటీ ఏర్పాటు సాధ్యం కాదు. అయితే, కొత్త వర్సిటీ పెడుతున్నామని, అందుకే హెడ్ క్వార్టర్స్ మారుస్తున్నట్టు యూజీసీకి అప్లికేషన్ పెట్టుకున్నారనే చర్చ జరుగుతున్నది. దీంతో యూజీసీ ఆ వర్సిటీకి అనుమతులు ఇచ్చింది. ఇందులో కూడా తెలంగాణలోని అంబేడ్కర్ యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్, పూర్వ విద్యార్థుల ఫీడ్ బ్యాక్, చరిత్ర, యాక్టివ్ స్టూడెంట్స్, లెర్నింగ్ సెంటర్స్, రీజినల్ సెంటర్స్, అల్యూమ్ని, అకడమిక్ కౌన్సెలర్స్ తదితర అంశాలన్నీ ఏపీ అంబేడ్కర్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అసలు కొత్త యూనివర్శిటీలో ఇలాంటివన్నీ ఎలా ఉంటాయని, యూజీసీని తప్పుదోవ పట్టించేందుకే ఈ సమాచారాన్నంతా వాడుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వాపోతున్నారు.

రూ. 600 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు

ఏపీ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల ప్రకారం ఆస్తులు, నిధుల పంపకాలు 58 : 42 నిష్పత్తిలో జరగాల్సి ఉంది. 2014 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని వర్సిటీ కేంద్రాలు, ఉద్యోగుల నిర్వహణ, ఇతర సేవలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి దాదాపు రూ.600 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలపై రాష్ర్ట ప్రభుత్వం.. ఏపీలోని కూటమి ప్రభుత్వంతో చర్చలు జరపకపోవడంతో ఆ బకాయిలు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తెలంగాణలోని ప్రధాన వర్సిటీపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న సార్వత్రిక విద్యావ్యవస్థలో ఈ తరహా జాప్యం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విభజన కమిటీలు ఉన్నా..

ఉమ్మడి ఆస్తుల పంపకం, సమస్యల పరిష్కారానికి విభజన కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ, వాటి పనితీరు నామమాత్రంగానే మారిందనే విమర్శలు వస్తున్నాయి. కీలకమైన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య స్పష్టమైన అంగీకారం కుదరకపోవడంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, విభజన కమిటీలను పునరుద్ధరించి.. బకాయిల విడుదలతో పాటు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థులు, వర్సిటీ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టబద్ధంగా రావాల్సిన వాటా నిధులను ఏపీ సర్కార్ వెంటనే విడుదల చేయాలని, పదేళ్లు గడిచినా పరిష్కారం కానీ ఈ సమస్యలకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

Next Story