- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,

దిశ, జూబ్లీహిల్స్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని దాశరథి ఆడిటోరియం లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాలు కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక చిహ్నమని అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు తరలివస్తారని, అమ్మవారి దర్శనం కోసం వివిధ దేవాలయాలను సందర్శిస్తారని చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించాలని దేవదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బోనాలు, గణేష్ ఉత్సవాలు, రంజాన్, మొహర్రం వంటి భారీ మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం హైదరాబాద్ యంత్రాంగానికి ఉందని, అదే సమన్వయం, ప్రణాళిక, అంకితభావంతో బోనాల ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, లక్షలాది మంది భక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు.
ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నిరంతరం పెంచుతూ వస్తోందని పేర్కొన్నారు. 2021లో 1,028 ఆలయాలకు, 2022, 2023 లో చెరో 1,073 ఆలయాలకు, 2024లో 1,253 ఆలయాలకు, 2025 లో రికార్డు స్థాయిలో 3,026 ఆలయాలకు రూ.5.80 కోట్ల ఆర్థిక సహాయం అందించిందన్నారు. అర్హత కలిగిన ఆలయాల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, భక్తుల రద్దీ, ఆలయ అవసరాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సహాయం అందించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంత్రాంగాలకు, దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.
భక్తుల సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన మంత్రి, ప్రధాన ఆలయాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, తాగునీటి సౌకర్యం, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ, క్యూ లైన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వైద్య శిబిరాలు, అత్యవసర స్పందన వ్యవస్థలు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశమున్నందున టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, సబ్జీ మండి, అక్కన్న మాదన్న ఆలయాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, జీహెచ్ఎంసీ, ఇతర పౌర శాఖలు సమగ్ర భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ, జనసమ్మర్థ నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా భక్తులు, విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ముందస్తు ప్రణాళికల ద్వారా సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
బోనాల పండుగ విశిష్టత, చరిత్ర, సంప్రదాయాలు, కార్యక్రమాల షెడ్యూల్, ట్రాఫిక్ ఆంక్షలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సమాచార, పౌర సంబంధాల శాఖను మంత్రి ఆదేశించారు. బోనాల విశిష్టతపై ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం గావించాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణ సందర్భంగా అధికారులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవస్థానం లో జాతర తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలోని ఐదు గురువారాలు, నాలుగు ఆదివారాల్లో గోల్కొండలో జాతర ఉత్సవాలు నిర్వహించబడతాయి. రాష్ట్ర ప్రభుత్వం జూలై 16న పట్టు వస్త్రం సమర్పించనుంది.
జూలై 21న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాల సమర్పణ, జూలై 22న రథోత్సవం జరుగుతాయి. ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రధాన బోనాల ఉత్సవాలు, పట్టు వస్త్రాల సమర్పణ నిర్వహించబడగా, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, అంబారీ ఊరేగింపు నిర్వహించబడతాయి. ఆగస్టు 9న ఇతర ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ జరగనుంది. అదే రోజు సబ్జీ మండి, కార్వాన్ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించబడగా, ఆగస్టు 10న హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఉత్సవాల కాలమంతా ఘటోత్సవం, బోనం సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజు విన్యాసాలు, శివసత్తుల కార్యక్రమాలు, రంగం, తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు, సమర్థవంతమైన అమలు అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా సమావేశంలో బోనాల విశిష్టత గురించి మాట్లాడారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, డీజీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మేడ్చల్-సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, టీజీఎన్‌పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ జి. ముకుంద రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ రావు, రోడ్లు భవనాల శాఖ, రవాణా, టీజీఎస్ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు, ఉమ్మడి ఆలయ కమిటీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






