- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు గోల్కొండ నుండి లాల్‌దర్వాజా వరకు బోనాల జాతర
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పని చేయాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో మొదలౌతుందని , 20,21,22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఉత్సవాలు జరుతాయని వెల్లడించారు . 20 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం , 21 వ తేదీన అమ్మవారికళ్యాణం, 22 వ తేదీన రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని మంత్రి చెప్పారు . ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం, ఆగస్టు 9న హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల తో పాటు, నగరంలోని ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు .
అధికారులు అప్రమత్తంగా ఉండాలి...
బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, ట్రాన్స్‌కో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, పౌర సరఫరాల శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ, రైల్వే, సమాచార, పౌర సంబంధాల శాఖ, పురావస్తు శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దేవాలయాల వద్ద క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, భద్రత, ప్రత్యేక బస్సుల నిర్వహణ, పూల అలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు వంటి అన్ని ఏర్పాట్లు త్వరైతగతిన పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని , భక్తులు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు పోలీసు, ప్రభుత్వ శాఖల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి భక్తుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సులను నడిపిస్తున్నందున రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని మంత్రి కోరారు.
3427 దేవాలయాలకు నిధులు విడుదల...
పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 3427 దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిమిత్తం రూ 15,45,41,150 నిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బోనాల సందర్భంగా గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ - పోచమ్మ, హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ, లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి ఆలయాలతో పాటు నగరంలోని దాదాపు 30 ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఇతర ముఖ్య నేతలు అధికారులు, సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల అనంతరం ఫలహారం బండ్ల ఊరేగింపు జరగనుంది.






