హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-20 11:19:28  IST  )

హైదరాబాద్‌(Hyderabad Bonalu)లో ఆషాఢ మాస బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad Bonalu)లో ఆషాఢ మాస బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు లాల్ దర్వాజాలోని సింహవాహిని(Lal Darwaja Simhavahini) శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవం లక్షలాది భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీ జగదంబిక అమ్మవారి ఆలయంలో బంగారు బోనంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, ప్రతి ఆదివారం, గురువారం తొమ్మిది బోనాల సమర్పణతో కొనసాగి చివరగా సింహవాహిని అమ్మవారి బోనాలతో పూర్తి అవుతాయి. కాగా నేడు సింహవాహిని ఆలయంలో ఉదయం 3 గంటల నుండి మహాభిషేకంతో పూజలు మొదలై, ఉదయం 6 గంటల నుండి వేలాది మహిళా భక్తులు బోనం సమర్పించారు. జులై 21న హంపి నుండి తీసుకొచ్చిన లక్ష్మి ఏనుగుపై అమ్మవారి ఘటం ఊరేగింపు డప్పు నృత్యాలు, పోతరాజు ప్రదర్శనలతో వైభవంగా జరగనుంది.

అలాగే రేపు ఉదయం రంగం జరగనుంది. సింహవాహిని అమ్మవారి బోనాల జాతరకు హైదరాబాద్, సికందరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివచ్చారు. అలాగే నేడు నగరంలో చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి, సికందరాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి, బాల్కంపేట్ ఎల్లమ్మ, షా అలీ బండాలోని ముత్యాలమ్మ, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయాలు బోనాలతో, భక్తులతో కిటకిటలాడాయి. భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు కోమటిరెడ్డి వెంటకరెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించగా.., లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. బోరబండలోని పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ విజయశాంతి బోనం సమర్పించగా, ఖిల్లా మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క బోనం సమర్పించారు.

Next Story