Bomb Threat : బొల్లారం ఆర్మీ స్కూల్ కు బాంబు బెదిరింపులు

by Muthe.Rajitha |   (  Updated:2025-02-11 12:14:19  IST  )

బొల్లారంలోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌(Bollaram Army Public School)కు బాంబు బెదిరింపు(Bomb Threat) ఈమెయిల్ వ‌చ్చింది.

Bomb Threat : బొల్లారం ఆర్మీ స్కూల్ కు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్ : బొల్లారంలోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌(Bollaram Army Public School)కు బాంబు బెదిరింపు(Bomb Threat) ఈమెయిల్ వ‌చ్చింది. గుర్తు తెలియ‌ని వ్యక్తి ఐడీ నుంచి ఈమెయిల్(Email) వ‌చ్చినట్టు బుధ‌వారం ఉద‌యం స్కూల్ నిర్వహకులు తెలిపారు. ఈ మెయిల్ బెదిరింపు వల్ల తక్షణమే అధికారులు, ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యి.. హుటాహుటిన పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి, పిల్లలను ఇంటికి పంపించారు. ఆర్మీ పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందంతో స్కూల్ పరిసరాలలో, అన్ని గదుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో టీచ‌ర్లు, పిల్లలు, వారి త‌ల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ బెదిరింపు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాంబు బెదిరింపు మెయిల్ చేసిన వ్యక్తని త్వర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

మంగళవారం ఇదే తరహా బెదిరింపులు

బుధవారం బొల్లారం ఆర్మీ స్కూల్ కు బాంబు బెదిరింపులు రాగా.. మంగళవారం కూడా నగరంలోని ఓ ప్రముఖ స్కూల్ కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్(Nacharam DPS)‌లో గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్లో బాంబు పెట్టామని మెయిల్ ద్వారా బెదిరింపులు చేశారు. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ స్కూల్ మొత్తం తనిఖీలు చేపట్టింది. ఇక ఈ నెలలో ఇది రెండోసారి డీపీఎస్‌కు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. దీంతో బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. వరుసగా నగరంలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తుండటంతో దీనిపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు.

Next Story