టీటీడీ పరకామణి వ్యవహారం కోట్లాది భక్తులను కలిచివేసింది: బీజేపీ చీఫ్​ రాంచందర్‌రావు

by Vemula.Srinu Prasad |

టీటీడీ పరకామణి వ్యవహారం కోట్లాది భక్తులను కలిచివేసిందని బీజేపీ చీఫ్​ రాంచందర్‌రావు అన్నారు...

టీటీడీ పరకామణి వ్యవహారం కోట్లాది భక్తులను కలిచివేసింది: బీజేపీ చీఫ్​ రాంచందర్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీటీడీలో వెలుగుచూసిన పరకామణి వ్యవహారం దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులను తీవ్రంగా కలిచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం పట్ల ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికత, భక్తి అన్నీ ఈ వ్యవహారంలో దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ ఘటనను చిన్నదిగా చూడడం తప్పు అని స్పష్టం చేస్తూ, ఇది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే పెద్ద విషయం అని పేర్కొన్నారు. ఆదివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక వ్యక్తి నేరం చేసిన తర్వాత డబ్బు తిరిగి ఇచ్చినా, ఆ నేరం రద్దవదని, చట్టప్రకారం నేరం నేరంగానే మిగిలిపోతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పరకామణి లెక్కల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, కౌంటింగ్ చేసే సిబ్బంది ఎంపిక నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణ వరకు ఆధునిక టెక్నాలజీ వినియోగించాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి భక్తుల నమ్మకానికి సమాధానం ఇవ్వాలని, టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచినందుకు ప్రశంసించారు. ఈకార్యక్రమంలో జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, చిలుకూరు రంగరాజన్ స్వామి, జె.డి. లక్ష్మీనారాయణ ప్రసంగించారు. ఇటువంటి వ్యవహారాలను సిస్టమ్ లోపాలుగా కాకుండా భక్తుల నమ్మకానికి ద్రోహంగా పరిగణించాలని అన్నారు. భక్తుల విరాళాల వినియోగంపై పబ్లిక్ డిస్క్లోజర్ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు.

Next Story