- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజనుల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేయాలి: బండారు దత్తాత్రేయ
అడవులను అమ్మలా ఆదరించి, భూమిని దేవతగా భావించి సంరక్షించిన గొప్ప వారసత్వం గిరిజన సమాజానిదని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

దిశ, సికింద్రాబాద్: అడవులను అమ్మలా ఆదరించి, భూమిని దేవతగా భావించి సంరక్షించిన గొప్ప వారసత్వం గిరిజన సమాజానిదని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, స్వాభిమానాన్ని కాపాడుతూ వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమ్మక్క–సారలక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, గోపాల్ రావు స్మారక సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సెమినార్ ముగింపు సమావేశం శనివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు సభకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, ప్రకృతితో మమేకమై నీతి, నిజాయితీ, సామూహిక జీవన విధానాన్ని కొనసాగించిన ఆదివాసీ సమాజానికి వందనం చేయాలని అన్నారు. అడవులు, కొండలు, వాగులు, జీవవైవిధ్యాన్ని సంరక్షిస్తూ తరతరాలుగా జీవించిన గిరిజన సమాజానికి దేశం రుణపడి ఉందన్నారు.
సంప్రదాయాలకు ప్రతిబింబం...
అయితే గిరిజనుల భూమి హక్కులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, తాగునీరు, రవాణా వంటి అంశాల్లో ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఆదివాసి కుటుంబానికి చేరేలా ప్రభుత్వాలు, సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. గిరిజన భాషలు, జ్ఞాన సంపద, జీవన విధానం భారతదేశానికి అమూల్యమైన వారసత్వమని పేర్కొంటూ, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభాషల పరిరక్షణ, గిరిజన భాషల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని దత్తాత్రేయ తెలిపారు. ప్రతి భాష ఒక సమాజపు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు మాట్లాడుతూ గిరిజన సమాజాల అభ్యున్నతికి విద్య, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించాలని అన్నారు. గిరిజన యువత తమ మాతృభాషపై గర్వపడుతూ ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ‘జల్, జంగల్, జమీన్’ కోసం పోరాడిన గిరిజన వీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి సంక్షేమం కోసం అందరూ అంకితభావంతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ తదితరులు పాల్గొన్నారు.






