బల్దియా బడ్జెట్ రూ.11,050 కోట్లు

by Ajay Maddhiboyina |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయ, వ్యయాల ఆధారంగా ఈసారి అదనంగా రూ.2 వేల కోట్లను పెంచి రూ.11,050 కోట్లు ఉండేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ‌తేడాది బ‌డ్జెట్ అంటే 2025-26 బ‌డ్జెట్‌ను రూ.8440 కోట్లతో రూపొందించిన విషయం తెలసిందే.

బల్దియా బడ్జెట్ రూ.11,050 కోట్లు
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయ, వ్యయాల ఆధారంగా ఈసారి అదనంగా రూ.2 వేల కోట్లను పెంచి రూ.11,050 కోట్లు ఉండేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ‌తేడాది బ‌డ్జెట్ అంటే 2025-26 బ‌డ్జెట్‌ను రూ.8440 కోట్లతో రూపొందించిన విషయం తెలసిందే. అధికారులు తయారుచేసిన అంచనాలకు కమిషనర్ కర్ణన్ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 21వ తేదీన జ‌రుగ‌నున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో డ్రాఫ్ట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ షెడ్యూల్ ఇలా..

జీహెచ్ఎంసీ చట్టం–1955 ప్రకారంగా నవంబర్ 10వ తేదీ వరకు వార్షిక బడ్జెట్ అంచనా నివేదికను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టాలి. కానీ, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ నెల 21న నిర్వహించి అందులో బడ్జెట్ అంచనాలు ప్రతిపాదించనున్నారు. స్టాండింగ్ కమిటీలో చర్చించి సవరణల తర్వాత చేర్పులు, మార్పులతో కూడిన బడ్జెట్‌ను డిసెంబర్ 10వ తేదీలోపు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ ఆమోదం పొందిన వార్షిక బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల ప్రతులను ప్రతి కార్పొరేటర్‌కు డిసెంబర్ 15 లోపు అందజేయాల్సి ఉంది. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 20 లోపు జీహెచ్ఎంపీ ఆమోదించాల్సి ఉంది. అనంతరం మార్చి 1 లోపు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది.

అధికారులతో మంతనాలు

జీహెచ్ఎంసీ బడ్జెట్ రూపకల్పనపై అదనపు, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ కర్ణన్ చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది. బల్దియాకు ప్రధాన విభాగాల నుంచి వచ్చే ఆదాయం, ఖర్చు చేయాల్సి అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్లు, సిటీ ప్లానర్లు, ఎస్ఈలు వార్షిక బడ్జెట్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గతంలో హెడ్ ఆఫీసు స్థాయిలోనే బడ్జెట్‌ను తయారు చేసేవారు. కానీ గతేడాది నుంచి డిప్యూటీ కమిషనర్ల నుంచి అంచనాలను అడుగుతున్నారు. జీహెచ్ఎంసీ చట్టం-1955 సెక్షన్ 182 ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ అంచనాల నివేదికను ప్రతిఏటా నవంబర్ 10వ తేదీలోపు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు ప్రవేశపెట్టాలని ఉన్నందున.. కమిషనర్ ఆర్వీ కర్జన్ కసరత్తు చేస్తున్నారు.

డ్రాఫ్ట్ బడ్జెట్ రూ.11,050 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్లోనూ గ్రేటర్‌కు కేటాయింపులు పెరుగుతాయనీ, రెవెన్యూ రిసీట్స్, ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్, ఎస్టేట్, పార్కుల ఆదాయాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ రిసీట్స్ రూ.4,445 కోట్లుగా ఉంటే ఈ ఏడాది రూ.5,550 కోట్లుగా ఉండొచ్చని, క్యాపిటల్ వ్యయం రూ.4000 కోట్లు ఉంటే వచ్చే ఏడాది రూ.5,500 కోట్లుగా పెరుగుతుందని అధికారుల అంచనా. హెచ్-సిటీ ప్రాజెక్టులు కార్యరూపంలోకి రావడంతోపాటు ఎస్ఎన్డీపీ, నాలాల మాస్టర్ ప్లాన్, సీఆర్ఎంపీ, వీధిదీపాల నిర్వహణసైతం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. 2024-25లో బడ్జెట్ అంచనాలు రూ.7,937 కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ.8,440 కోట్లకు పెరిగింది. ఈ రెండు బడ్జెట్ల వ్యత్యాసం రూ.503 కోట్లుగానే ఉంది. అయితే, వచ్చే వార్షిక బడ్జెట్ అంచనాలు రూ.11,050 కోట్ల వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆదాయంపై ఆశలు

జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరులుగా ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ నుంచే వచ్చేదే అధికం. అయితే ప్రాపర్టీ వసూళ్లను రూ.2,500 కోట్లకు పెంచడానికి కమిషనర్ కర్ణన్ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. పాత బకాయిలను వసూలు చేయడానికి రెండు నెలలకు ముందుగానే ఓటీఎస్ స్కీమ్ తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. దీంతోపాటు మాల్స్, ఇతర వాణిజ్య భవనాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని సైతం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే టీజీఎస్పీడీసీఎల్ డేటా ఆధారంగా 97 వేల వాణిజ్య భవనాలకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 1340 భవనాలకు పన్నును సవరించడంతో జీహెచ్ఎంసీకి రూ.1.13 కోట్ల ఆదాయం పెరిగింది. 2024-25లో ఆస్తిపన్ను వసూలు రూ.1970 కోట్లు అనుకుంటే రూ.2033 కోట్లు వసూలైంది. 2025-26లో రూ.2,500 కోట్లు వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయం సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లోనే రూ.7.59.98 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి 31 వరకు మరో రూ.1000కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలూ లేకపోలేదని, ప్రజలపై ఏలాంటి భారాలేయకుండా వ్యవస్థలను సరిచేయడం ద్వారా జీహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచాలని కమిషనర్ కర్ణన్ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

Next Story