- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబంధనలు పాటించని అవినాష్ కాలేజ్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లాభార్జన ధ్యేయంగా కనీస ప్రమాణాలు పాటించకుండా కళాశాల నడుపుతున్న తీరు ఎల్బీనగర్ లో మన కళ్లకు కనబడుతుంది.

దిశ, చైతన్య పురి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లాభార్జన ధ్యేయంగా కనీస ప్రమాణాలు పాటించకుండా కళాశాల నడుపుతున్న తీరు ఎల్బీనగర్ లో మన కళ్లకు కనబడుతుంది. ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ దారి మెట్లు లేకుండా కళాశాల నడుపుతున్నారు. కార్పొరేట్ స్థాయి చదువు చెబుతున్నామని, ఇష్టానుసారంగా విద్యార్థులను చేర్చుకొని లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్న అవినాష్ కాలేజీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంటర్ బోర్డు అధికారులు నోటీసులు జారీచేసి జరిమానా విధించినా తీరు మారకపోవడం గమనార్హం. విద్యార్థి సంఘాలు ఎన్ని మార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఆందోళన చేసినా యాజమాన్యం పెడచెవిన పెట్టడం షరా మామూలుగా మారింది.
అసలు విషయం ఏమిటి..?
ఎల్బీనగర్ లో అవినాష్ కాలేజ్ ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల నడుపుతున్నారు. ఇంటర్మీడియట్ లో ఎంఈసి, సిఇసి గ్రూపులు ఏర్పాటుచేసి ఒక్కో గ్రూపులో 1000 మందికి పైగా విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కాలేజ్ నడుపుతూ బీకాం, బిబిఏ కోర్సులు ఏర్పాటు చేశారు. ఈ కోర్సులకు కలిపి 2000 పైచిలుకు విద్యార్థులు ఉండడం గమనార్హం. ఇంటర్, డిగ్రీతో పాటు ఐఎస్ఎఫ్ఎస్ అనగా ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్, గ్లోబల్ ఫైనాన్స్ క్యారీర్ తో సిఏసిఎంఎస్, సిఎస్ కోచింగ్ లు ఇస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించి..
ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ ప్రకారం అనుమతి పొందిన ఇంటర్మీడియట్ కళాశాలకు సపరేట్ భవనం ఉండాలి. ఒక్కోగదిలో 40 లేదా 50 మంది విద్యార్థులు ఉండాలి. డైమెన్షన్ ప్రకారం ప్రతి తరగతి గదికి వెంటిలేషన్ ఫైర్ సేఫ్టీ ఉండాలి. అదే మాదిరిగా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ నిబంధనలు ప్రకారం సపరేట్ భవనం, వెంటిలేషన్, ఫైర్ సేఫ్టీ ఉండాలి. కానీ సపరేటు భవనం లేకుండా ఒకే భవనంలో ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు నడుపుతూ.. నిబంధనలు అతిక్రమించారు. కమర్షియల్ భవనంలో ఇంటర్, డిగ్రీ కళాశాలలు నడుపుతున్నారు. ఈ భవనంలో క్రొమా షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారు. ఏదైనా కళాశాల ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తున్న భవనంలో కమర్షియల్ షాపింగ్ మల్స్ లాంటివి ఉండకూడదు. కానీ ఇక్కడ ఒక ఫ్లోర్ పూర్తిగా కమర్షియల్ షాపింగ్ నిర్వహణ ఉంది. ఈవిషయం విద్యార్థి సంఘాల ద్వారా తెలుసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మిక్స్ డ్ ఆక్యుపెన్సి కింద అవినాష్ కళాశాలకు 2023- 24, 2024- 25 సంవత్సరాలలో లక్షలలో జరిమానా విధించారు. అయినా యాజమాన్యం తీరు మారడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సంబంధిత శాఖలో పనిచేసే అధికారులకు ముడుపులు ముడుతున్నాయని అపవాదం ఉంది. దీంతో పాటు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ముడుపులు అందజేస్తున్నట్లు ప్రచారం ఉంది. అనేకసార్లు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేశారు. అయినా ఎవరేం చేస్తారని ధీమాతో కళాశాల యాజమాన్యం ఉండడం గమనార్హం.
నాన్ దోస్త్ కళాశాల..
ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో డిగ్రీ నాన్ దోస్త్ కళాశాలగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రత్యేక భవనం ఉండాలి వాస్తవానికి మిక్స్ డ్ ఆక్యుపెన్సీ కింద జరిమానా విధించాలి. కానీ యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ భవనంలో బీకాం, బీబీఏ ఒకేసారి నడపాలి కానీ స్థల ప్రభావం వలన షిఫ్ట్ వైస్ గా నడిపిస్తున్నారు.
లోన్ ఆప్ ద్వారా ఓటిపి పాలసి..
దేశంలో ఎక్కడలేని, ఏ యూనివర్సిటీకి లేని ఓటిపి పాలసిని ఇక్కడ అమలు పరుస్తున్నారు. రీ అడ్మిషన్ పాలసి పేరిట రూ. 3 వేలు వసూలు చేస్తున్నారు. లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల నుండి ఒకేసారి ఏడాది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకవేళ విద్యార్థి తండ్రికి డబ్బు సమకూరకపోతే లోన్ యాప్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రైవేట్ యాప్ ద్వారా తండ్రికి ప్రైవేట్ రుణం ఇప్పించి కళాశాల యాజమాన్యం ఒకే సమయంలో ఫీజులు తీసుకుంటున్నారు. తదుపరి విద్యార్థి తండ్రి నెలనెల ఈఎంఐ పద్ధతిలో సంబంధిత అమౌంట్ ను కడుతూ నానా అవస్థలు పడుతున్నారు. పరీక్ష ఫీజు కూడా విద్యార్థి యాప్ ద్వారానే చెల్లించాలి. యాప్ మెయింటెనెన్స్, పరీక్షఫీజు, కాలేజ్ అక్రిడేషన్ ఫీజు విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేస్తున్నారు.
చివరకు ఫీజులు కట్టుకున్నారు..
మిక్స్ డ్ ఆక్యుపెన్సి ఉండడం, ఫైర్ సేఫ్టీ లేకపోవడం వలన ఇంటర్మీడియట్ అధికారులు నామ మాత్రపు నోటీసులు జారీ చేస్తున్నారు. యాజమాన్యం చలనం లేకుండా ఉండడంతో విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరయ్యే పరీక్ష ఫీజులు కట్టుకోవడానికి ఇంటర్ బోర్డ్ అధికారులు అవకాశం ఇవ్వలేదు. అయినా యాజమాన్యం తీరు మారలేదు. పరీక్ష ఫీజులు కట్టకపొతే విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోతారని ఆలోచన చేసి చివరి నిమిషంలో రూ. 3 వేలతో పరీక్ష ఫీజు చెల్లించుటకు అవకాశం కల్పించారు. అపరాధ రుసుము కళాశాల యాజమాన్యం భరించినట్లు తెలిసింది. ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కళాశాల తనిఖీ చేసే సమయంలో కళాశాల నడుపుతున్న కమర్షియల్ భవనం ముందు వైపునుండి దారి చూపుతారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తనిఖీకి వచ్చిన సమయంలో డిగ్రీ తరగతులకు భవనం వెనుక వైపు నుండి దారిని చూపిస్తారు. ఇంత పెద్ద భవనానికి ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చినా ఎమర్జెన్సీ దారిమెట్లు లేవు.
శ్యామ్ కిరణ్, ఏబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్, ఎల్బినగర్ విభాగ్ కన్వీనర్..
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అవినాష్ కాలేజీ పైన అనేకమార్లు ఇంటర్మిడియేట్ బోర్డ్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా బోర్డు రెగ్యులేషన్ కు విరుద్ధంగా పాలసీల పేరిట లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని బోర్డ్ అధికారులు కాలేజ్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.






