ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్

by velandi.Saikiran |

మల్టీ లెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో పెరుగుతున్న రోడ్ సైడ్ పార్కింగ్ సమస్యకు

ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలకు ఇక నుంచి శాశ్వతంగా తెర పడనుంది. నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద పార్కింగ్‌ అనేది తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం పార్క్‌కు, పార్క్‌లో వాకింగ్‌కు వచ్చేవారు పార్కింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఒకవైపున వాహనాలు పార్క్‌ చేయడంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పార్కింగ్ కష్టాలను తొలగించడంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మల్టీ లెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ పచ్చజెండా ఊపింది. ఇక్కడ 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నవ నిర్మాణ్‌ అసోసియేట్స్‌ మల్టీలెవెల్‌ పార్కింగ్‌ వ్యవస్థను నిర్మించింది.

72 ఈక్వివలెంట్‌ కార్‌ స్పేసెస్‌

ఆటోమెటిక్ స్మార్ట్ కార్ పార్కింగ్ సెంటర్‌లో 72 ఈక్వివలెంట్‌ కార్‌ స్పేసెస్‌ ఉంటుంది. మొత్తం పార్కింగ్‌ విస్తీర్ణంలో 20 శాతాన్ని ద్విచక్రవాహనాల కోసం కేటాంచారు. ఈ ప్రాజెక్ట్‌ను నవ నిర్మాణ్‌ అసోసియేట్స్‌ డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్ఓటీ) పీపీపీ మోడల్‌లో నిర్మించి అమలు చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఇక్కడ పార్క్‌ చేసుకోవచ్చు. యంత్రాలు, స్మార్ట్‌ కార్డ్‌ల ద్వారా పార్కింగ్‌ టికెట్‌లు జారీ చేస్తారు. ముందగానే పార్కింగ్‌ బుక్‌ చేసుకునేందుకు, నావిగేషన్‌, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్‌ యాప్‌ను తీసుకురానున్నారు. పార్కింగ్‌ సజావుగా సాగేందుకు డిజిటల్‌ సర్వీసుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇప్పటికే పూరైన మల్టీ లెవెల్‌ స్మార్ట్ పార్కింగ్‌ ఇటీవలే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.

నేటి నుంచి అందుబాటులోకి

జీహెచ్ఎంసీ పరిధిలో పబ్లిక్ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన మొదటి మల్టీ లెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్‌గా ప్రత్యేకత కలిగిన దీనిని ఈ నెల 29వ తేదీన జీహెచ్ఎంసీ ప్రారంభించనుంది. మల్టీ లెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో పెరుగుతున్న రోడ్ సైడ్ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలను నిలిపే వీలుండటంతో పాటు ట్రాఫిక్ సజావుగా స్మూత్‌గా సాగేందుకు, పాదచారుల భద్రతకు ఇది తోడ్పడనుంది.

మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ప్రత్యేకతలు ఇవే!

- కాంపాక్ట్ డిజైన్

- నిలువు రోటరీ సిస్టమ్ ద్వారా భూమి వినియోగం తగ్గింపు

- పార్కింగ్ సామర్థ్యం: 72 కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక స్థలాలు

- స్మార్ట్ యాక్సెస్: ఆర్ఎఫ్ఐడీ ఆధారిత ప్రవేశం–నిష్క్రమణ

- ఈవీ చార్జింగ్: గ్రీన్ మొబిలిటీకి తోడ్పాటు

- స్మార్ట్ భద్రత: సెన్సర్లు, లాకింగ్ వ్యవస్థలు, సీసీటీవీ పర్యవేక్షణ

- పని వేళలు: ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు

Next Story