- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు అంతరాష్ట్ర చైన్ స్నాచర్ల అరెస్ట్
ఎల్బీనగర్ జోన్.. హయత్ నగర్, చైతన్యపురి, నాగోల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకే రోజు జరిగిన 3 చైన్ స్నాచింగ్ కేసులను చైతన్యపురి పోలీసులు పది రోజుల వ్యవధిలోనే చాకచక్యంగా ఛేదించారు.

దిశ, వనస్థలిపురం : మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్.. ఎల్బీనగర్ జోన్, హయత్ నగర్, చైతన్యపురి, నాగోల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకే రోజు జరిగిన 3 చైన్ స్నాచింగ్ కేసులను చైతన్యపురి పోలీసులు పది రోజుల వ్యవధిలోనే చాకచక్యంగా ఛేదించారు. ఇద్దరు అంతరాష్ట్ర చైన్స్నాచర్లను ఢిల్లీలో అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారు నగలు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్ డీసీపీ అనురాధ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఢిల్లీలోని ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా పనిచేసే అక్షయ్‌కుమార్ శర్మ(29), రోహిత్ (26) ఇద్దరు అంతరాష్ట్ర చైన్ స్నాచర్లు. ఈ నెల 17న ఎల్బీనగర్ జోన్ పరిధిలోని 3 పీఎస్‌ల పరిధిలో బజాజ్ పల్సర్ బైక్‌పై సంచరిస్తూ గంటల వ్యవధిలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. పల్సర్ బైక్‌ను కూడా అదే రోజు తెల్లవారుజామున గోపాలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేశారు. దొంగతనం చేసిన తర్వాత బైక్‌ను సికింద్రాబాద్‌లోని సంగీత థియేటర్ క్రాస్ రోడ్స్ సమీపంలో వదిలేసి ఢిల్లీకి పారిపోయారు. ఈ ఘటనపై చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు నేతృత్వంలో పోలీసులు 3 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, టవర్ డంప్ అనాలిసిస్ ఆధారంగా నిందితుల కదలికలను గమనిస్తూ సమాచారం సేకరించారు. ఒక టీమ్ ఢిల్లీకి వెళ్లి, చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి మొత్తం 11తులాల 3 బంగారు గొలుసులుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..
ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ శర్మ పై దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లో మొత్తం 21 కేసులు ఉండగా.. రోహిత్ పై 13 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, నాగపూర్లలో నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 9 కేసులు ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో పలు ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడినట్లు రికార్డుల్లో ఉందన్నారు. 2025 జూలైలో నాగ్‌పూర్ పోలీసులు వీరిని అరెస్ట్ చేయగా.. జైలు నుంచి విడుదలైన వెంటనే హైదరాబాద్‌కు వచ్చి పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో 7 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.
చైతన్యపురి పోలీసులను అభినందించిన డీసీపీ
ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు, డీఐ గురుస్వామిలు కేసు వేగంగా చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందాలను అభినందించారు. అనంతరం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించారు.
ప్రజలు అలర్ట్‌గా ఉండాలి: డీసీపీ అనురాధ
ఇటీవల జరుగుతున్న వరుస చైన్‌స్నాచింగ్‌ల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, ఒంటరిగా వెళ్లే చోట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.






