- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 08న చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
చేప ప్రసాదం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

దిశ , హైదరాబాద్ బ్యూరో : చేప ప్రసాదం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి కావాల్సిన విస్తృత ఏర్పాట్లను మంత్రులు వాకిటి శ్రీహరి, మొహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, వివిధ శాఖల అధికారులు, బత్తిని కుటుంబ సభ్యులు, సామాజిక సంస్థల ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ వచ్చే నెల 08న ఉదయం 11 గంటలకు మొదలై 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని.. దీనికి 179 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. చేప ప్రసాదం హైదరాబాద్ నగర ప్రత్యేకతగా నిలిచిందన్నారు.
తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు, ఆస్తమా బాధితులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ఈసారి సుమారు లక్షలాది మంది ప్రసాదం స్వీకరించే అవకాశం ఉందన్నారు. గత అనుభవాలను సమీక్షించి లోపాలను సరిదిద్దుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భారీ జన సామర్థ్యం దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, క్రౌడ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని సూచించారు. పిక్‌పాకెటింగ్, చోరీలు, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమ ప్రాంగణం , పరిసర ప్రాంతాల్లో రాత్రంతా పూర్తి స్థాయి లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అవసరమైన మందులు, సీపీఆర్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది , వాలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. పోలీస్, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, విద్యుత్, రెవెన్యూ, ఆర్టీసీ, రవాణా, ఫిషరీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య , సమాచార శాఖ సమన్వయంతో పనిచేస్తూ బ్యారికేడింగ్, క్యూ లైన్లు, వాటర్‌ప్రూఫ్ షెడ్లు, టెంట్లు, పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అవగాహన ప్రచారం, అదనపు బస్సు సర్వీసులు, అగ్నిమాపక భద్రత తదితర ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, 1847లో బత్తిని వీరన్న గౌడ్ ప్రారంభించిన ఈ చేప ప్రసాదం పరంపర 179 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసంతో కొనసాగుతుండటం విశేషమన్నారు. ఇటువంటి సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన చేపలను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచాలని, అదనపు నిల్వ కూడా సిద్ధంగా ఉంచాలని ఫిషరీస్ అధికారులను ఆదేశించారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి వివిధ ప్రాంతాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు విశ్వాసంతో ఈ కార్యక్రమానికి వస్తారని, అధికారులందరూ సమిష్టిగా పని చేయాలన్నారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, హైదరాబాద్ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్, ప్రాంతీయ సమాచార అధికారి రాములు, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్, హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణ, అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.






