- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి వెళుతున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!?
జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దిశ , హైదరాబాద్ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా నవరాత్రులు పూజలు అందుకున్న వినాయక ప్రతిమల నిమజ్జనం శనివారం జరుగనున్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా చూసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. మరోవైపు శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తలమునకలయ్యారు. గ్రేటర్ పరిధిలో విగ్రహాల నిమజ్జనం ప్రతిష్ఠించిన మూడో రోజు నుంచే మొదలైంది. అయితే ఐదో రోజు నుంచే అధిక సంఖ్యలో వినాయక విగ్రహాల నిమజ్జనం మొదలు కావడంతో ముందే నిమజ్జనం చేసే చెరువుల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ట్యాంక్ బండ్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్‌ల వంటి 20 ప్రధాన లేక్‌లతో పాటు 72 చోట్ల కృత్రిమ కొలనులను అందుబాటులోకి తెచ్చింది.
అందంగా అలంకరించిన శకటాలపై గణనాథులను ఊరేగిస్తూ, భక్తి గీతాలు ఆలపిస్తూ, భజనలు, కోలాటాల సందడి మధ్య శోభాయాత్ర సాగనున్నది. రాష్ట్రంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకున్నాయి. నిమజ్జనం జరిగే చోట్ల బారికేడ్‌లను ఏర్పాటు చేసి తొక్కిసలాట జరుగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా.. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని గ్రేటర్ పరిధిలోని చాలా చోట్ల ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. నిమజ్జన వేడుకలు తిలకించేందుకు వచ్చే భక్తులు ట్రాఫిక్ అధికారులు సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు నిమజ్జనం వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు మెట్రో అధికారులు చర్యలు తీసుకున్నారు .
రోడ్లకు మరమ్మతులు..
వినాయక విగ్రహాల ఊరేగింపు నిర్వహించే దారుల్లో అవసరమైన చోట్ల రోడ్లకు మరమ్మతులు, ట్రీ కట్టింగ్, ఇతర అభివృద్ధి పనులు అధికారులు కొన్ని రోజుల ముందే పూర్తి చేశారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో క్రేన్లు, లైటింగ్, జనరేటర్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం తదితర అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. నిమజ్జనాన్ని పురస్కరించుకుని అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించడం, మఫ్టీ, షీ టీంలను కూడా ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. యాత్ర సాగుతున్న తీరును పోలీస్ ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించనున్నారు.
30 వేల మంది పోలీసులతో బందోబస్తు..
నగర వ్యాప్తంగా సుమారు 303 కిలోమీటర్ల మేర సాగే ఏకదంతుని నిమజ్జనం కోసం సుమారు 30 వేల మంది పోలీస్ సిబ్బందితో ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలోని అన్ని ప్రధాన లేక్‌లలో 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, 56,187 టెంపరరీ లైట్ల పనులు ముందుగానే పూర్తి చేశారు. హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీంలను, 200 మంది గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలను డిప్లాయ్ చేశారు. వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్ వర్కర్స్ మూడు షిఫ్టుల్లో రౌండ్ ది క్లాక్‌గా పని చేయనున్నారు. ఈ నెల 2వ తేదీ వరకు నగర వ్యాప్తంగా 1,21,905 గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగాయని, 6వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వివరించారు. ఆ దిశగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 309 మొబైల్ టాయిలెట్స్ ను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఖైరతాబాద్ వినాయక ప్రతిమ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వద్ద బాహుబలి క్రేన్‌ను ఏర్పాటు చేశారు.
రెండు గంటల వరకు మహాగణపతి నిమజ్జనం..
శనివారం మధ్యాహ్నం రెండు గంటల్లోపే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కోత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందుకోసం శుక్రవారం నుంచే తరలింపునకు కావాల్సిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ నిమగ్నమైంది. బాలాపూర్ గణపతిని కూడా ఆ తర్వాత నిమజ్జనం చేయనున్నారు. ఈ భారీ విగ్రహం నగరంలో 19 కిలో మీటర్లు శోభాయాత్ర ముగించుకొని గుర్రం చెరువు కట్ట మైసమ్మ వద్ద హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించనుంది. అలియాబాద్, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, బషీర్ బాగ్‌ల మీదుగా విగ్రహాన్ని నిమజ్జనం చేసే నెక్లెస్ రోడ్డుకు తరలనుంది.
ఏర్పాట్లలో వైద్య ఆరోగ్యశాఖ..
గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కూడా అన్ని చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సాగే ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యం అందించేందుకు గాను వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఖైరతాబాద్‌లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం..
ఖైరతాబాద్ వినాయక మండపం తో పాటు నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలు విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే భక్తులకు దర్శనాలు నిలిపి వేసి మండప తొలగింపు పనులు చేపట్టడంతో సమయానికి పనులు అయ్యేలా చూడాలని ఖైరతాబాద్ మండప నిర్వాహకులకు ఆయన సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గ్రేటర్‌లోని మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. నిమజ్జనాన్ని భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. మొబైల్ క్రేన్లు కూడా అందుబాటులో ఉన్నాయని, అవసరమైన ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్..
కట్ట మైసమ్మ దేవాలయం → కేశవగిరి → చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ → మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ → ఇంజన్ బౌలి → అలియాబాద్ → నాగుల్చింత జంక్షన్ → హిమ్మత్‌పురా → చార్మినార్ → మదీనా ఎక్స్ రోడ్ → అఫ్జల్ గుంజ్ →ఎంజే మార్కెట్ → అబిడ్స్జీపీవో →బీజేఆర్ విగ్రహం → బషీర్‌బాగ్ చౌరస్తా → లిబర్టీ → అంబేద్కర్ విగ్రహం→ హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్).
ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్..
బడా గణేష్ → పాత పీఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ → తెలుగు తల్లి → అంబేద్కర్ విగ్రహం → హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్).






