అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

by Muthe.Rajitha |

జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్, హయత్‌నగర్ సర్కిల్‌లో భారీ అక్రమ షెడ్లు, కమర్షియల్ షెటర్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?
X

దిశ, వనస్థలిపురం : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్, హయత్‌నగర్ సర్కిల్‌లో భారీ అక్రమ షెడ్లు, కమర్షియల్ షెటర్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్ డివిజన్లలో ప్రధాన రోడ్ల వెంట, కాలనీల ముఖ్య కూడళ్లకు సమీపంలో కొందరు యజమానులు యథేచ్ఛగా వ్యాపార కమర్షియల్ సెంటర్లు నిర్మిస్తున్నారు. నిర్మాణాలు చేపట్టి కమర్షియల్ షాపులకు కిరాయిలకు ఇచ్చి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది తూతూ మంత్రంగా తనిఖీలు, నోటీసుల పేరుతో మమా అనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బల్దియా ఆదాయానికి లక్షల్లో గండిపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చర్యలు తీసుకోవడంలో కాలయాపన..

గ్రేటర్​హైదరాబాద్​శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, నాగోల్ డివిజన్లు అభివృద్ధిలో భాగంగా శరవేగంగా విస్తరిస్తూ ఎన్నో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ఇదే అదునుగా నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్ ముఖ్య కూడళ్లతో పాటు ప్రధాన రోడ్ల వెంట కొందరు ప్లాట్ల యజమానులు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే భారీ రేకుల షెడ్లు, కమర్షియల్ రేకులతో షాపులు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. షాపులను కిరాయికి ఇచ్చి నెలకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని తెలిసింది. వీటిలో పలు రకాల వ్యాపార, వాణిజ్య లావాదేవీలు యథేచ్చగా కొనసాగుతున్నా.. రోడ్ల పక్కన వాటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దుకాణ సముదాయాల నుంచి జీహెచ్ఎంసీకి ఎలాంటి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా రావడం లేదు. వీటిని కట్టడి చేయడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటో నోటీసు, రెండో నోటీసు ఇస్తామంటూ కాలయాపన చేస్తూ నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారే తప్పా.. చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

రాక్​టౌన్​కాలనీలో..

నాగోల్​డివిజన్​రాక్​టౌన్​కాలనీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కమాన్ సమీపంలో ఉప్పల్​నుంచి ఎల్బీనగర్ వచ్చే ప్రధాన రోడ్డుకు ఆనుకుని వరుసగా సెల్లార్లతో కూడిన అక్రమ నిర్మాణాలు, భారీ షెడ్లు యథేచ్ఛగా సాగుతున్నా బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. నామ్‌కే వాస్తే కూల్చివేతలు చేపట్టినా నిర్మాణదారులు కాసులు చెల్లించి మళ్లీ నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల సమీపంలోనే ఓ వ్యక్తి యథేచ్ఛగా భారీ అక్రమ షెడ్ నిర్మిస్తున్నా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అటువైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని స్థానికులు తెలిపారు. స్థానికులు, సామాజికవేత్తలు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.

హయత్‌నగర్..సూర్యనగర్ కాలనీలో..

హయత్‌నగర్ డివిజన్ సూర్యనగర్ కాలనీ శరవేగంగా విస్తరిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కాలనీ రోడ్డుకు ఆనుకుని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓ ప్లాట్ యజమాని రేకుల కప్పుతో కూడిన షెటర్లు నిర్మిస్తున్నారు. దీనిపై స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని తెలిసింది.

స్పందించని సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ..

నాగోల్, హయత్‌నగర్‌లో వెలుస్తున్న అక్రమ షెడ్ల నిర్మాణాలపై జీహెచ్ఎంసీ హయత్‌నగర్​సర్కిల్ టౌన్​ప్లానింగ్​ఏసీపీ శాంసన్‌ను వివరణ కోరేందుకు ‘దిశ’ ప్రతినిధి ప్రయత్నించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం.

Next Story