హైద‌రాబాద్ పోలీసుల చేతిలోకి మ‌రో ఏఐ ఆయుధం

by Ratna Kumari |

హైదరాబాద్ పోలీసులు ఏఐ టెక్నాలజీతో సరికొత్త అప్లికేషన్ సాక్ ఐ(సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటలిజెన్స్) రూపొందించారు.

హైద‌రాబాద్ పోలీసుల చేతిలోకి మ‌రో ఏఐ ఆయుధం
X

దిశ‌, సిటీ క్రైం : హైదరాబాద్ పోలీసులు ఏఐ టెక్నాలజీతో సరికొత్త అప్లికేషన్ సాక్ ఐ(సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటలిజెన్స్) రూపొందించారు. ఈ అప్లికేషన్ తో సోషల్ మీడియాలో ఉండే నేరగాళ్ల నెట్ వర్క్ ను పోలీసులు గుర్తించనున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని పసిగట్టి ఉక్కుపాదం మోపనున్నారు. మహిళలు, పిల్లల అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ అప్లికేషన్ ద్వారా పోలీసులు ప్రత్యేక నజర్ ను పెట్టున్నారు. మరో వైపు డయల్ 100 ఫోన్ కాల్స్, అంతర్గత నిఘా, నగరంలో జరిగే ప్రధాన ఘటన సమాచారం, వివరాలను ఒకే చోట క్రోడీకరించి ఈ అప్లికేషన్ అధికారులకు పూర్తి గ్రౌండ్ రిపోర్టును అందుబాటులో పెడుతుంది.

ఈ సాక్ ఐ ను అందుబాటులోకి తీసుకువచ్చిన కొన్ని రోజులలోనే పురానాపూల్ ఎక్స్ రోడ్డు, గుడి మల్కాపూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత పోస్టులను గుర్తించి వాటిని పోలీసు అధికారులతో పాటు సంబంధిత సోషల్ మీడియా నిర్వాహకులకు సమాచారాన్ని పంపించి 211 పోస్టులను తొలగించేలా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేసిందని పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియాలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాలు, సైబర్ వేధింపులు మహిళలు, పిల్లల భద్రత పై సాక్ ఐ నిరంతరం నిఘా పెడుతుందన్నారు. ఈ సాక్ ఐ అప్లికేషన్ ను రూపొందించిన హైదరాబాద్ ఐటీ సెల్ విభాగాన్ని సీపీ సజ్జనార్ అభినందించారు.

Next Story