దక్షిణ మధ్య రైల్వేలో సరుకు రవాణా ఆల్‌టైమ్ రికార్డు..!

by Nallavelli.Anjaneyulu |

దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో (మార్చి 24, 2026 వరకు) 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదు చేసి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.

దక్షిణ మధ్య రైల్వేలో సరుకు రవాణా ఆల్‌టైమ్ రికార్డు..!
X

దిశ, సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో (మార్చి 24, 2026 వరకు) 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదు చేసి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక సరుకు రవాణా లోడింగ్ కావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం ముందుగానే ఈ మైలురాయిని చేరుకోవడం రైల్వే శాఖ పని తీరును ప్రతిబింబిస్తోంది. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 144.14 మిలియన్ టన్నుల రికార్డును ఈసారి అధిగమించింది. సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాల నుంచి బొగ్గు, సిమెంట్ రవాణాలో ఈ జోన్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బొగ్గు 66.878 మిలియన్ టన్నులు, సిమెంట్ 37.572 మిలియన్ టన్నులు, ఇనుప ఖనిజం 8.620 మిలియన్ టన్నులు, ఎరువులు 8.038 మిలియన్ టన్నులు, ఆహార ధాన్యాలు 6.225 మిలియన్ టన్నులు రవాణా చేయడం జరిగింది.

అలాగే ఉక్కు పరిశ్రమలకు ముడి పదార్థాలు, కంటైనర్లు, పెట్రోలియం ఉత్పత్తులు తదితర సరుకుల రవాణా కూడా గణనీయంగా పెరిగింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, గూడ్స్ షెడ్ల మెరుగుదల, టెర్మినల్స్‌లో పనితీరు పెంపు, వినియోగదారులతో సమన్వయం వంటి చర్యలు ఈ విజయానికి దోహదపడ్డాయి. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆపరేషన్స్, కమర్షియల్ విభాగాలతో పాటు ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్స్ & టెలికమ్యూనికేషన్ విభాగాల సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరింత వృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story