- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ పోర్టు టూ ఫ్యూచర్ సిటీ 45 మినట్స్
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయి.

దిశ, రంగారెడ్డి బ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది ఆయన సంకల్పం. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఏండీఏ, టీజీఐఐసీ లతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలన్నది ఆకాంక్ష. వాస్తవరూపం దాల్చేందుకు కసరత్తు చేస్తున్నామని, దాదాపు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నగరంగా రూపొందించడంలో, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహిస్తుందని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎయిర్ పోర్ట్ నుంచి మీర్ ఖాన్ పేట్ లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీ కోసం జరుగుతున్న సర్వే పనులను ఆయన పరిశీలించి అనేక సూచనలు చేశారు. కొంగర కలాన్ దాటిన తరువాత ప్రస్తుతం రోడ్ లేకపోవడం వల్ల కాలినడకన కొండలు, గుట్టలు దాటుకొని ఆయన క్షేత్ర స్థాయి పర్యటన చేశారు.
40 కి.మీ. మెట్రో
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. అది ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై, కొత్తగా ఏర్పరచబోయే మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్ పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి రోడ్డు గుండా 5 కిలోమీటర్లు ముందుకు సాగుతుంది. అక్కడి నుంచి పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుంది. బహదూర్ గుడలో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్ గుడ, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలో మీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్ లో మెట్రో రైల్ కి కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామన్నారు. రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రో రైల్ కి కేటాయించారు. ఈ కేటాయించిన రోడ్ మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ 'ఎట్ గ్రేడ్' (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ విశాలమైన రోడ్ మధ్యలో అదే లెవెల్ లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా మరల రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
గతానుభవాన్ని గుర్తు చేసిన ఎండీ
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఓఆర్ఆర్ లో అంతర్భాగంగా భవిష్యత్ లో నిర్మించబోయే మెట్రో కి తగినంత స్థలాన్ని కేటాయించాలన్న అప్పటి తన ప్రతిపాదనను అంగీకరించారని, ఓఆర్ఆర్ లో 20 మీటర్లు మెట్రోకి కేటాయించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. అప్పట్లో అనేక మంది ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితలకే పరిమితమవుతాయని, అవి ఆచరణ సాధ్యం కాదని అపహాస్యం చేసినా, ఈ రోజు ఓఆర్ఆర్, మెట్రో రెండూ కూడా కార్యరూపం దాల్చాయన్నారు. వీటి వల్ల హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోందని, ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైద్రాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మెట్రో ఎండీ అన్నారు. ఏ విధంగా అయితే ప్రపంచంలో ప్రప్రధమంగా 22 వేల కోట్ల రూపాయలతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేసామో, అదే విధంగా ఈ ప్రణాళికలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతతో కార్యరూపం దాల్చేలా హెచ్ఎండీఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయన్నారు. నార్త్ సిటీ లోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. క్షేత్ర పరిశీలనలో సంబంధిత ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.






