- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంగ్విన్ సెక్యూరిటీస్ వ్యవహారంపై సిట్ విచారణ కోరిన న్యాయవాది సుబ్బారావు
ట్రేడింగ్, పెట్టుబడి పథకాల పేరుతో వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు సేకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు.

దిశ, ఖైరతాబాద్ : ట్రేడింగ్, పెట్టుబడి పథకాల పేరుతో వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు సేకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధిక లాభాల ఆశ చూపిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని సంస్థలు భారీ స్థాయిలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన మంగ్లి, రమావత్ మధు కేసు మరిచిపోకుండానే తాజాగా పెంగ్విన్ సెక్యూరిటీస్ వ్యవహారం బయటకు వచ్చిందని పేర్కొన్నారు.లక్ష రూపాయల పెట్టుబడిపై నెలకు రూ.5 వేల వరకు రాబడి ఇస్తామని, మూలధనం పూర్తిగా భద్రంగా ఉంటుందని నమ్మబలికి, పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే వారికి మరింత అధిక లాభాలు వస్తాయని ప్రచారం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ‘ఇండెమ్నిటీ బాండ్’ పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి సుమారు 300 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ మోసానికి సంబంధించిన ఆర్థిక నష్టాలను తట్టుకోలేక ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సుబ్బారావు పేర్కొన్నారు. ఇలాంటి ఆర్థిక నేరాలను పోలీసులు తరచుగా సివిల్ వివాదాలుగా పరిగణించడం వల్ల నిందితులు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఈ అంశంపై ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, భారీ పెట్టుబడి మోసాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. జీడిమెట్ల సూరారానికి చెందిన మృతుడు మురళీధర్ రెడ్డి కుమార్తె దీక్ష మాట్లాడుతూ, తన తండ్రి రూ.28 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారని తెలిపారు. మేడ్చల్‌కు చెందిన భరత్ మాట్లాడుతూ, తాను రూ.70 లక్షల వరకు చెల్లించానని, ప్రారంభంలో కొంతకాలం రాబడులు వచ్చినప్పటికీ అనంతరం చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు.






