- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు భద్రత ఏది? అర్ధరాత్రి ఆకతాయిల బరితెగింపు
మహిళ అర్ధరాత్రి ఒంటరిగా, స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని గాంధీజీ కల కలగానే మిగిలేలా ఉంది.

మహిళలకు భద్రత ఏది?
- హైదరాబాద్ లో అర్ధరాత్రి
ఆకతాయిల బరితెగింపు
- లేడీ పోలీస్ బాస్ ‘ఆపరేషన్’లో
వెలుగుచూసిన గస్తీ లోపాలు
దిశ, చైతన్యపురి/ సిటీ క్రైం: మహిళ అర్ధరాత్రి ఒంటరిగా, స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని గాంధీజీ కల కలగానే మిగిలేలా ఉంది. రాజధానిలో అర్ధరాత్రి సమయంలో ఒంటరి మహిళ బయటికొస్తే ఎంత మాత్రం సురక్షితం కాదని స్పష్టమవుతున్నది. ముఖ్యమంత్రి నుంచి డీజీపీ, పోలీసు కమిషనర్లు, డీసీపీలు.. ఇలా ప్రతిఒక్కరూ పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు చెప్పేది ఒకేమాట.. మహిళా భద్రతకు కట్టుబడి ఉన్నామని, వారికి అండగా ఉంటామని, వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తుంటారు. కానీ ఆ భరోసా మాటలకే పరిమితమైందని క్షేత్రస్థాయి పరిస్థితిని గమనిస్తే అర్థమవుతున్నది. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా నిలబడితే సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టి వస్తావా..? నీ రేటు ఎంత..? వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టిన వైనం తాజాగా మల్కాజిగిరి సీపీ సుమతి చేపట్టిన ‘డెకాయ్ ఆపరేషన్’లో బట్టబయలైంది. సుమారు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు దిల్ సుఖ్ నగర్ బస్టాప్ లో నిలబడి ఆపరేషన్ నిర్వహించారు. పోకిరీలు, ఆకతాయిలు ఆమెను వెకిలిచేష్టలతో ఇబ్బంది పెట్టినా ఆ నాలుగు గంటల పాటు అంత రద్దీ రోడ్డుపై పోలీసు గస్తీలేకపోవడంతో పోలీసు వ్యవస్థపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీస్ పెట్రోలింగ్ పై విమర్శలు
సీపీ సుమతికి ఎదురైన చేదు అనుభవంతో సామాన్య మహిళ, యువతులు ఎన్ని రకాలుగా వేధింపులకు గురవుతున్నారో తేలిపోయింది. ఇలాంటి వాటిని మహిళలు, యువతులు వాటిని భరిస్తు మౌనంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత రద్దీ ప్రాంతంలోనే పోలీసు గస్తీ లేదంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ ఎలా పనిచేస్తుందోనని విమర్శిస్తున్నారు. అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు ఎందుకు ఆ సమయంలో అక్కడికి రాలేదన్న ప్రశ్న అందరిలోనూ నెలకొన్నది. వేధింపులకు గురయ్యే మహిళలు, యువతులు మౌనంగా వాటిని భరిస్తూ ముందుకు సాగిపోవడమే కానీ వారు పోలీసు ఫిర్యాదులు, స్టేషన్ చుట్టూ తిరిగేందుకు ధైర్యం చేయబోరని నగరవాసులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి వేళ మహిళలు, యువతులు ఉద్యోగాలు, ఇతర పనులపై బయటికెళ్లి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవాలంటే ప్రధాన కూడళ్లు, నిర్మానుష్య గల్లీల్లో పోలీసు గస్తీ కొనసాగించాలని కోరుతున్నారు. లేడీ పోలీసు బాస్ చేపట్టిన ఆపరేషన్ లో వెలుగుచూసిన లోపాలను సరిదిద్ది మహిళా భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.






