దారుణం : నిండు గర్భిణి అని చూడకుండా.. ఆడపడుచు భర్త ఏం చేశాడంటే?

by Dishanational2 |
దారుణం : నిండు గర్భిణి అని చూడకుండా.. ఆడపడుచు భర్త ఏం చేశాడంటే?
X

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండాపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన వి.వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతి(32)తో కలిసి నగరానికి వచ్చి ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. భార్యాపిల్లలతో కలిసి కొండాపూర్ బీఆర్ టవర్స్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి చైత్ర అనే పదేళ్ల కుమార్తె ఉంది. భార్య స్రవంతి ప్రస్తుతం 8 నెలల గర్భిణి.

తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీప్రసన్న వివాహం 2020లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరు శ్రీరామకృష్ణ(35) కు ఇచ్చి వివాహం జరిపించడంలో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించాడు. శ్రీరామకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య లక్ష్మీప్రసన్నతో విజయవాడలో ఉంటున్నాడు. కొంత కాలంపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో తన పుట్టింటి వాళ్లకు లక్ష్మీప్రసన్న విషయం తెలియజేసింది. వెంకట రామకృష్ణ, బావకు పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గత ఏడాది శ్రీరామకృష్ణ స్వగ్రామానికి వెళ్లి అక్కడ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. చర్చలు విఫలం కావడంతో లక్ష్మీ ప్రసన్న చందానగర్ లో తమ పుట్టింటి వారి వద్ద ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఇదే క్రమంలో నెలక్రితం భర్త, అత్తింటివారిపై ఆమె చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి శ్రీరామకృష్ణకు నోటీసులు జారీ చేశారు. గ్రామానికి వచ్చి పంచాయితీ పెట్టి తన పరువు తీశారని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఇదంతా వెంకట రామకృష్ణ దంపతులు చేయిస్తున్నారని వారిపై శ్రీరామకృష్ణ కక్ష పెంచు కున్నాడు. బావమరిదిని అడ్డుతొలగించుకోవలని నిర్ణయించుకున్నాడు.

ఇటీవల నగరానికి చేరుకుని హఫీజ్ పేటలోని ఓ హాస్టల్లో ఉంటున్న శ్రీరామకృష్ణ హత్యకోసం ఎర్రగడ్డలో వేటకొడవలిని కొనుగోలు చేశాడు. ఈనెల 6న తన కారులో కొండాపూర్ లో ఉంటున్న బావమరిది ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో బావమరిది తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లాడు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి, రామకృష్ణ చేతిలో ఉన్న వేటకొడవలిని చూసి కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో శ్రీరామకృష్ణ వేట కొడవలితో ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం, భుజం మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి చెందింది. ఫిర్యాదు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆపార్టుమెంట్ లో లభించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతడిని మరుసటి రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Next Story