- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరాన్ని కుదిపేస్తున్న గందరగోళం..80 శాతం బంకులు మూసివేత
పెట్రోల్ దొరకదనే భయంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా గుమిగూడుతున్నారు. కొందరు డబ్బాలు, క్యాన్లు తీసుకుని నిలబడడం పరిస్థితి తీవ్రతను చూపుతున్నది.

రోజుకో వింత.. ఇంధన తంటా
- నగరాన్ని కుదిపేస్తున్న గందరగోళం
- సోషల్ మీడియా ప్రచారాలతో మరింత ఆందోళన
– 80శాతం బంకుల మూసివేత
- ఉన్న వాటి వద్ద భారీ క్యూలు
- జనజీవనంపై తీవ్ర ప్రభావం
- గ్యాస్ నుంచి పెట్రోల్ వరకూ అదే వరుస
నగరంలో ఇంధన సమస్యలపై నెలకొన్న గందరగోళం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్నటి వరకు గ్యాస్ కొరతతో సిలిండర్ల కోసం క్యూలో నిల్చొన్న ప్రజలు, ఇప్పుడు పెట్రోల్ దొరకదనే వార్తలతో బంకుల వద్ద క్యూలు కడుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఇంకా కోలుకోకముందే, పెట్రోల్ కొరతపై ప్రచారం ప్రారంభమైంది. సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న సందేశాలు ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతున్నాయి.
దిశ, హస్తినపురం: పెట్రోల్ దొరకదనే భయంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా గుమిగూడుతున్నారు. కొందరు డబ్బాలు, క్యాన్లు తీసుకుని నిలబడడం పరిస్థితి తీవ్రతను చూపుతున్నది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూసివేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొరత లేదని చెబుతున్నా.. కొరత లేనప్పుడు పెట్రోల్ బంకులు ఎందుకు మూసి వేస్తున్నారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల సాధారణ వినియోగదారులు మరింత ఆందోళనకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిల్వలు ఉన్నాయా?
చమురు నిల్వలు సరిపడా ఉన్నాయా? లేకపోతే ఎందుకు కొరత ఏర్పడుతోంది?
ఉంటే ప్రజలకు స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు? అనే ప్రశ్నలను ప్రజాసంఘాలు లేవనెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం స్పందన లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నది. అధికారిక సమాచారం లేకపోవడం, సోషల్ మీడియా ప్రచారాల ప్రభావంతో అపోహలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ అపోహలే క్యూలకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
బ్యాటరీ వాహనాల వైపు మొగ్గు..!
ఇంధన సమస్యల నేపథ్యంలో కొంతమంది ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ వాహనాల వినియోగంపై ఆసక్తి పెరుగుతున్నది. ఈ పరిస్థితులు సహజసిద్ధమా? లేదా? మార్పు దిశగా ప్రజలను మళ్లించేందుకు ప్రభుత్వాలే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నాయా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అపోహలను తొలగిస్తూ, ఇంధన సరఫరాపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం అత్యవసరం. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని నగరవాసులు కోరుతున్నారు.






