గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో 666 సమస్యాత్మక ప్రాంతాలు

by Batti.Sumithra |

గ్రేటర్ హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో 666 సమస్యాత్మక ప్రాంతాలు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు డీఆర్సీ సెంటర్ ల నుంచి ఎన్నికల సామాగ్రి , ఈవీఎంలను అధికారులు అప్పగించారు. పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉన్నతాధికారులు సిబ్బందికి వివరించారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఓటర్ స్లిప్పులు అందని వారు తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకునేందుకు 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయడం ద్వారా తెలుసుకునేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా జిల్లాలో గురువారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 1వ తేదీన తిరిగి అన్ని విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి.

666 సమస్యాత్మక ప్రాంతాలు..

గ్రేటర్ వ్యాప్తంగా 1700 పోలింగ్ లొకేషన్లలో మొత్తం 4915 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిల్లో 666 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలోని మొత్తం ఏడు జోన్లలో 1600 మంది రౌడీషీటర్లు ఉండగా వారి పై పోలీస్ నిఘా ఉంచారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 2.5 లక్షల వాహనాలను తనిఖీ చేసినట్లు సీపీ సందీప్ శాండిల్య వివరించారు. ఎన్నికల రోజున వాహనాల పై బయటకు వచ్చే వారు తగిన పత్రాలు వెంట ఉంచుకోవాలని ఆయన సూచించారు.

నిబంధనల మేరకు నెంబర్ ప్లేట్లు ఉండాలని, డీఎల్, ఆర్సీ వంటివి తప్పనిసరి వెంట ఉంచుకోవాలని, లేని పక్షంలో అటువంటి వాహనాలను సీజ్ చేస్తారని, ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం జరిగే ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, నగర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

జిల్లాలో 45,37,256 మంది ఓటర్లు..

హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 45,37,256 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 23,22,990 మంది పురుష ఓటర్లు, 22,19,939 మంది మహిళా ఓటర్లు, 327 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.85 లక్షల మంది ఓటర్లు, అత్యల్పంగా చార్మినార్ సెగ్మెంట్ లో 2.26 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువత 84,705 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

Next Story