డ్రగ్స్ రహిత సమాజం కోసం ఓయూలో 2కే రన్

by Ratna Kumari |

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా “రన్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ” పేరిట 2కే రన్ నిర్వహించారు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం ఓయూలో 2కే రన్
X

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా “రన్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ” పేరిట 2కే రన్ నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం , LIVE సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరుగు తీశారు. టీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు విజయ్ నాయక్ మాట్లాడుతూ “మత్తు వదులు- ఆరోగ్యంగా జీవించు” అనే నినాదంతో యువతలో చైతన్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, విజ్ఞానాన్ని తమ భవిష్యత్తు సాధనంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ హితానికి మహనీయుల ఆశయాలు మార్గదర్శకాలని ఆయన పేర్కొన్నారు. డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి సైనికుడిలా ముందుండాలని సూచించారు. తండాల నుంచి వచ్చిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, ఉస్మానియా అధ్యక్షుడు రాజేష్ చౌహాన్ పాల్గొన్నారు.

Next Story