మ‌ల‌క్ పేట‌లో 2 కిలోల గంజాయి స్వాధీనం

by Nallavelli.Anjaneyulu |

దిశ, చంపాపేట్ : హైదరాబాద్ నగరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న చాదర్‌ఘాట్ పోలీసులు కీ

మ‌ల‌క్ పేట‌లో 2 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, చంపాపేట్ : హైదరాబాద్ నగరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న చాదర్‌ఘాట్ పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. మలక్‌పేట్ గంజ్ సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్న రాధా కృష్ణ పాండే (34) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు ఒక వివో మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితుడు బీహార్ రాష్ట్రం, బెగుసరాయ్ జిల్లా, మతిహాని మండలం, గోర్గమా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఫిబ్రవరి 2025 నుంచి హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మార్కెట్ సమీపంలో నివసిస్తూ దినసరి కూలీగా పనిచేస్తూ నెలకు సుమారు రూ.20,000 వరకు సంపాదిస్తున్నాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసుల విచారణలో సిగరెట్లు, గుట్కా, గంజాయి సేవించే అలవాటు వల్ల గంజాయికి బానిసై, అధిక ధర కారణంగా తానే గంజాయి విక్రయించి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారంలోకి దిగినట్లు వెల్లడైంది. మొదట మలక్‌పేట్ మార్కెట్ సమీపంలో చిన్న ప్యాకెట్లు కొనుగోలు చేసి విక్రయించినప్పటికీ లాభం తక్కువగా ఉండటంతో, తన స్వగ్రామం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ జిల్లా లబగావ్ గ్రామానికి చెందిన ఉమేష్ అనే వ్యక్తి నుంచి రూ.20,000కు 2 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గంలో హైదరాబాద్‌కు తరలించినట్లు గుర్తించారు. అనంతరం మలక్‌పేట్ గంజ్ పరిసర ప్రాంతాల్లో అవసరమైన వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు HNEW బృందం సహకారంతో చాదర్‌ఘాట్ పోలీసులు 16-12-2025న నిందితుడిని అరెస్ట్ చేసి, గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సరఫరాదారు ఉమేష్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును సబ్-ఇన్‌స్పెక్టర్ ఐ. కల్పన నిర్వహిస్తుండగా, మలక్‌పేట్ డివిజన్ ఏసీపీ కె. సుబ్బ రామి రెడ్డి పర్యవేక్షణలో చాదర్‌ఘాట్ ఎస్‌హెచ్‌ఓ కేబీ మురారి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story