- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2050 కల్లా విశ్వనగరంగా హైదరాబాద్.. రూ.4 లక్షల కోట్లతో CMP-2050 సిద్ధం!
హైదరాబాద్ నగరాభివృద్ధికి హెచ్‌ఎండీఏ (HMDA) రూ.4 లక్షల కోట్లతో 'సీఎంపీ-2050' ప్రణాళికను సిద్ధం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండీఏ మాస్టర్ రూపకల్పన తుది దశకు చేరుకున్నది. ఇందులో ఎకానమిక్ డెవలప్ మెంట్ ప్లాన్(ఈడీపీ), కంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ), బ్లూ, అండ్ గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్లకు నివేదికలు రూపొందించారు. వాటిలో ముఖ్యంగా ప్రజారవాణాకు మొబిలిటీ ప్లాన్ కీలకంగా మారింది. కంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్(సీఎంపీ)-2050 అమలుకు రూ.నాలుగు లక్షల కోట్లు అవసరమని హెచ్ఎండీఏ అంచనా వేసింది. దీంతో పాటు ప్రజారవాణాను మెరుగుపర్చడానికి చేపట్టాల్సిన ప్రాజెక్టులపై లీ అసోసియేట్స్ కీలక అంశాలపై సిఫార్సులు చేసింది.
556 కి.మీ. మెట్రోరైలు మార్గం
హైదరాబాద్ లో మొదటి దశలో 69కి.మీ. మెట్రోరైలు నడుస్తున్నది. రెండో దశలో భాగంగా(ఏ) 76.4 కి.మీ.లు, (బీ) 86.1 కి.మీ పొడవును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 231కి.మీ.కు చేరనుంది. దీన్ని 2030 నాటికి 258.4 కి.మీ, 2040 నాటికి 435.1కి.మీ, 2050 నాటికి 566.6కి.మీ.కు విస్తరించాలని ప్రతిపాదించారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని సైతం 336 కి.మీ.కు పెంచాలని ప్లాన్ రూపొందించారు.
19,352 కి.మీ. రోడ్ నెట్‌వర్క్
మెట్రోపాలిటన్ ఏరియాలో రోడ్ నెట్ వర్క్ ను సైతం పెంచాలని ప్రతిపాదించారు. 11 జిల్లాల్లో హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు రోడ్లకు సైతం అప్ గ్రేడ్ చేయనున్నారు. మొత్తం 19,352 లేన్ కి.మీ.కు పెంచాలని సూచించారు. కొత్త రోడ్లతో పాటు లేన్ కిలోమీటర్లను సైతం పెంచాలని ప్రతిపాదించారు.
75 గ్రేడ్ సపరేటర్లు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించిన గ్రేడ్ సపరేటర్లతో పాటు కొత్తగా మరో 75 నిర్మించాలన్నారు. వాటితో పాటు 34 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు, 120 ప్రాంతాల్లో పాదచారుల వంతెనలు నిర్మించాలని గుర్తించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల మాదిరిగా మరో 8 ఎలివేటెడ్ రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా 29 బ్రిడ్జిలను నిర్మించేందుకు అవకాశం ఉందని గుర్తించారు. వీటితో పాటు 2040 వరకు 29 కి.మీ. డెడికేటెడ్ బస్ లేన్లు, 2050 వరకు 48కి.మీ. మార్గాలను సైతం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవేకాకుండా ఏడు ప్రాంతాల్లో ఇంటర్ సిటీ, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్, ట్రక్ టర్మినల్స్ సైతం నిర్మించాలని ప్రతిపాదించారు.
సీఎంపీపై వర్క్‌షాపు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి సమగ్ర మొబిలిటీ ప్రణాళికపై చర్చించేందుకు గురువారం బేగంపేట తాజ్ వివాంట హోటల్ లో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన వర్క్ షాపు నిర్వహించారు. పలువురు ముఖ్యఅధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి బలమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను వివరించారు. సీఎంపీని రూపొందించడంలో హెచ్ఎండీఏ కృషిని అభినందించారు. ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో రైలుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుదల, మెట్రోఫేజ్-2 విస్తరణ, పార్కింగ్ సమస్యల పరిష్కారం, తక్షణ మెరుగుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రొఫెసర్ సీఎస్ఆర్ కే ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎంపీని వికసిత్ భారత్ -2047 లక్ష్యాలతో అనుసంధానం చేసి, దాని పరిధిని త్రిపుల్ ఆర్ వరకు విస్తరించాలని సూచించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) డి.జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. పార్కింగ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు, బేగంబజార్‌కు లాజిస్టిక్స్ పరిష్కారాలు, ట్రాఫిక్ రద్దీ తగ్గించే వ్యూహాలను సూచించారు. రవాణా కమిషనర్ కె.ఇలంబర్తి మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. రోడ్డు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. మెట్రో, ఎంఎంటీఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. హైదరాబాద్- బెంగళూరు, అమరావతి–చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధి చేయాలని కోరారు.






