Sridhar Babu: ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్

by Gantepaka Srikanth |

ఏఐ ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Sridhar Babu: ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐ ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. శనివారం బాచుపల్లిలో నిర్వహించిన సీఎఫ్ఓల సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు.. ఇంజినీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయని తెలిపారు. కృత్రిమ మేధ టెక్నాలజీ పాత్రను పూర్తిగా మార్చేస్తున్నదని.. ఇప్పటివరకు కంపెనీ ఖర్చులను లెక్కించడానికి ఉపయోగపడిన టెక్నాలజీ, ప్రస్తుతం ఆవిష్కరణలు, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహాయపడుతున్నదన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందిందని తెలిపారు. వ్యాన్ గార్డ్, యూబీఎస్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మాస్ మ్యూచువల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జెపి మోర్గాన్ చేస్, గోల్డ్ మ్యాన్ శాక్స్, సిటి గ్రూప్ లాంటి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు నగరంలో భారీ టెక్నాలజీ, అనలిటిక్స్ కేంద్రాలను నిర్వహిస్తున్నాయని చెప్పారు.

నగరంలో ప్రస్తుతం 400 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు మూడు లక్షల మందికి పైగా వృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ ఐటీ రంగం ఎగుమతులు ఏడాదికి దాదాపుగా 40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు. తదుపరి దశ విస్తరణ కోసం ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐకేఏఎంలను ఏర్పాటు చేస్తున్నామని.. వీటి ద్వారా ఏఐ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడం, డిజిటల్ మౌలిక వసతులను మెరుగుపర్చడం, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిపుణులను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. డిజిటల్ యుగంలో సీఎఫ్ఓల పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. సదస్సులో చీఫ్ విజిలెన్స్ మాజీ కమిషనర్ కేవీ చౌదరి, ప్రముఖ నిర్మాత, విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు, ఫిక్కి సీఎఫ్ఓ కౌన్సిల్ చైర్మన్ రజనీష్ జైన్, కో చైర్మన్ సుబ్బయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story