న్యూయార్క్ మెట్రోను మించేసిన హైదరాబాద్?.. వైరల్ అవుతున్న బ్రిటిష్ వ్లాగర్ వీడియో

by Ramesh Naini |

హైదరాబాద్ మెట్రో సేవలపై బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ప్రశంసల వర్షం కురిపించారు.

న్యూయార్క్ మెట్రోను మించేసిన హైదరాబాద్?.. వైరల్ అవుతున్న బ్రిటిష్ వ్లాగర్ వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో సేవలపై బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రసిద్ధ న్యూయార్క్ మెట్రోతో పోల్చితే భాగ్యనగర మెట్రో ఎంతో శుభ్రంగా ప్రయాణికులకు అనుకూలంగా ఉందని ఆయన కితాబిచ్చారు. భారత పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఇషాక్ మెట్రోలో ప్రయాణించారు. ఆ అనుభవాలను వివరిస్తూ.. ‘పబ్లిక్ మెట్రో ఇన్ హైదరాబాద్’ పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పటివరకు చూసిన మెట్రో వ్యవస్థల్లో నాకు అత్యంత ఇష్టమైన వాటిలో ఇదీ ఒకటి’ అని ఆయన కొనియాడారు.

రద్దీ సమయాల్లో ప్రయాణించినా తనకు వెంటనే సీటు దొరికిందని, ముఖ్యంగా మెట్రో కోచ్‌ల పరిశుభ్రత, మెరుగైన నిర్వహణ, ఆకర్షణీయమైన ప్రకటనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఇషాక్ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విదేశీయులు సైతం మన మెట్రోను మెచ్చుకుంటుండటంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story