Sankranti Celebrations: సంక్రాంతికి హైదరాబాద్‌ స్కై ఫెస్టివల్‌ స్పెషల్‌.. రేపటి నుంచే మెగా సంబరాలు

by Ramesh Naini |

గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 16-17 తేదీల్లో డ్రోన్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగనున్న ఈ కార్యక్రమంలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్‌ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Sankranti Celebrations: సంక్రాంతికి హైదరాబాద్‌ స్కై ఫెస్టివల్‌ స్పెషల్‌.. రేపటి నుంచే మెగా సంబరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ నగరం ఈ సంక్రాంతికి రంగుల పండుగగా మారనుంది. గాలిపటాల నుంచి హాట్‌ఎయిర్‌ బెలూన్ల వరకు, డ్రోన్ ప్రదర్శనల వరకు నగరవాసులకు అరుదైన ఆకాశ వినోదాన్ని అందించేందుకు ప్రత్యేక వేడుకలు సిద్ధమయ్యాయి. సెకింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ గాలిపటం, స్వీట్స్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగే ఈ వేడుకల్లో వివిధ దేశాల గాలిపటాలు, సంప్రదాయ మిఠాయిల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

హాట్‌ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌

అదే వేదికగా జనవరి 16 నుంచి 18 వరకు హాట్‌ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రంగురంగుల బెలూన్లు ఆకాశంలో విహరిస్తూ నగరానికి పండుగ శోభను తీసుకొచ్చేందుకు నిర్వహకులు ప్లాన్ చేశారు.

గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్‌ ఫెస్టివల్‌

ఇక గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 16-17 తేదీల్లో డ్రోన్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగనున్న ఈ కార్యక్రమంలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్‌ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సంప్రదాయం, ఆధునికత కలయికగా నిర్వహించే ఈ వేడుకలు నగరవాసులకు మరిచిపోలేని సంక్రాంతి అనుభూతిని అందించనున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు రంగులు, సంస్కృతి, ఆకాశ విన్యాసాలతో హైదరాబాద్‌ సంక్రాంతి సంబరాలు ఈ సారి ప్రత్యేకంగా నిలవనున్నాయి.

Next Story